తిరుమలలో పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారు?

పవిత్రోత్సవాలు అనే పేరు వినగానే ఉత్సవంలోని ఉద్దేశం అర్థమైపోతుంటుంది. పవిత్రత కోసం ... పవిత్రంగా జరుపుకునే ఉత్సవాలుగా వీటిని గురించి చెప్పుకోవచ్చు. సాక్షాత్తు వైకుంఠ నాథుడైన శ్రీనివాసుడిని దర్శించడానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందువలన అప్పుడప్పుడు అనుకోని సంఘటనల కారణంగా ఈ ప్రదేశానికి దోషాలు అంటుతుంటాయి.

తిరుమల శ్రీనివాసుడిని సంతోషంగా దర్శించి సంతృప్తి చెందాలనే అందరూ ఈ క్షేత్రానికి వస్తుంటారు. అయితే అలా వాళ్లు తిరుమలలో అడుగుపెట్టినప్పుడో ... దర్శనం చేసుకోవడం కోసం 'క్యూ'లో నుంచున్నప్పుడో ... దర్శనం జరిగి ఇంకా కొండ దిగడానికి ముందో తమకి తెలియకుండానే మైల పడిపోతుంటారు. తమకి దగ్గర బంధువులు ఎవరైనా పోవడం ... తమకి బాగా దగ్గర వాళ్లు ప్రసవించడం వంటివి జరుగుతుంటాయి.

ఇక అనుకోని కారణాల వలన ఒక్కోసారి స్త్రీలు బహిస్టుకావడం జరుగుతుంటుంది. వీటిలో ఏదీ కూడా కావాలని ... ఉద్దేశ పూర్వకంగా చేసేవి వుండవు. కానీ ఆ కారణాలు అత్యంత పవిత్రమైన తిరుమలకొండపై దోష పరమైన ప్రభావం చూపుతుంటాయి. తెలియకుండగా ... ఎవరి ప్రమేయం లేకుండా జరిగే ఈ దోషాలను నివారించవలసిన అవసరం ఎంతైనా వుంటుంది. అందుకోసమే తిరుమలలో మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు.

ముందురోజు రాత్రి ఆలయం వెలుపల వసంత మంటపంలో అంకురార్పణ చేస్తారు. మొదటి రోజున శ్రీదేవి - భూదేవి సమేతుడైన మలయప్ప స్వామిని పవిత్రోత్సవ మంటపంలో వేంచేపు చేస్తారు. స్వామివారికి ... అమ్మవార్లకి పూజాభిషేకాలు జరుపుతారు. ఈ సమయంలోనే పట్టుదారాలతో అల్లిన పవిత్ర మాలలను యాగశాలలో ఉంచి హోమాలు చేస్తారు. ఆ సాయంత్రం స్వామివారిని ... అమ్మవార్లను నయనానందంగా అలంకరించి మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

మరుసటి ఉదయం యాగశాలలోని పవిత్ర మాలలను ఊరేగింపుగా గర్భాలయానికి తీసుకువెళ్లి, మూలామూర్తి వివిధ భాగాలను అలంకరిస్తారు. అలాగే కొలువు శ్రీనివాస మూర్తికి ... భోగ శ్రీనివాస మూర్తికి ... సీతారామలక్ష్మణులకు ... రుక్మిణీ కృష్ణులకు పవిత్ర మాలలను సమర్పిస్తారు. ఇక మూడవరోజున కూడా అభిషేకాలు ... హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేస్తారు. ఈ విధంగా చేయడం వలన తిరుమల ఎప్పటికప్పుడు తన పవిత్రతను తిరిగి పొందుతూ వుంటుంది ... అశేష భక్త జనకోటిని అనుగ్రహిస్తూ వుంటుంది.


More Bhakti News