శ్రీవారి నేత్ర దర్శనం

శ్రీవారి నేత్ర దర్శనం
తిరుమల క్షేత్రంలో అడుగుపెట్టడానికి ... అతి పవిత్రమైన ఏడుకొండలను అధిరోహించడానికి ... శ్రీవారిని దర్శించడానికి వేయి జన్మల పుణ్యం వెంటరావాలి. వైకుంఠం నుంచి దిగివచ్చి తనని దర్శించుకోమంటూ నిశ్చలంగా నిలిచిన స్వామిని మనసుతో అభిషేకించాలి ... చూపులతో సేవించాలి. ఆ దివ్య మంగళ రూపాన్ని హృదయంలో బంధించడం కోసమే ఎంతో దూరాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వారందరి ఆనందం కోసం స్వామి సర్వాలంకార భూషితుడై ముచ్చట తీరుస్తూ వుంటాడు.

అయితే ఎలాంటి ఆభరణాలు లేనప్పుడు స్వామి దర్శనం చేసుకోవాలనే ఆసక్తి చాలామందికి వుంటుంది. అలాంటి వాళ్లందరూ ఆయనని గురువారం రోజున దర్శించడానికి వెళతారు. ఎందుకంటే గురువారం రోజున 'నేత్ర దర్శనం' వుంటుంది. ఈ రోజున వేకువ జాములో రెండవ అర్చన ముగిసిన తరువాత, స్వామివారు ఎలాంటి అలంకారాలు లేకుండా ఎంతో నిరాడంబరంగా కనిపిస్తుంటాడు.

అప్పటి వరకూ వెడల్పుగా స్వామివారి నయనాలను సగభాగం వరకూ కప్పుతూ ఉంచిన పచ్చ కర్పూరపు నామాన్ని ఈ రోజున సన్నగా చేస్తారు. దాంతో స్వామివారి విశాల నేత్రాలు పూర్తిగా కనిపిస్తూ వుంటాయి. పూర్తి నేత్రాలను దర్శించే రోజు కనుక, దీనికి నేత్ర దర్శనం అనే పేరు వచ్చింది. ఇక ఈ రోజున స్వామివారు పట్టు తలపాగాను ... పట్టు ధోవతిని ధరించి దర్శనమిస్తాడు. నిగనిగలాడే నల్లని దేహంతో నిరాడంబరంగా దర్శనమిచ్చే స్వామిని గోపాలకుడి అవతారంగా భక్తులు భావిస్తుంటారు గనుక దీనిని 'నిజరూప దర్శనం' అని కూడా అంటారు.

ఇక ఈ నేత్ర దర్శనం రోజున స్వామివారి దృష్టి మరింత సూక్ష్మంగా ... తీక్షణంగా ఉంటుందట. ఈ రోజున దైవ సంబంధమైన విషయాల్లో ఎలాంటి పొరపాట్లు ... అపచారాలు జరిగినా ఫలితం వెంటనే కనిపిస్తుందని చెబుతారు. అందువలన స్వామివారి సేవల విషయంలో గానీ, ఆయన భక్తుల మనసుకి కష్టం కలిగించే చర్యలు గాని జరక్కుండా ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు.

More Bhakti Articles