టీ-శాట్ ద్వారా మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలను రూపొందించాలి: సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, నవంబర్ 3: టీ-శాట్ ద్వారా మరింత ప్రజోపయోగ, సమాచార కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సాఫ్ట్ నెట్, టీ.శాట్ కార్యక్రమాలపై నేడు బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన వర్కింగ్ బాడీ సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశానికి బీ.ఆర్. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.కె. సీతారామా రావు, ఎం.సి.ఆర్.హెచ్ ఆర్.డి. డైరెక్టర్ జనరల్ హరిప్రీత్ సింగ్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు దివ్య దేవరాజన్, తెలంగాణ టెక్నలాజికల్ సర్వీసెస్ ఎండి వెంకటేశ్వర్ రావు, సాఫ్ట్ నెట్ సి.ఈ.ఓ శైలేష్ రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ, విద్యా, మహిళా శిశు సంక్షేమ, యువజన, పంచాయితీ రాజ్ శాఖలు తమ విభాగాలకు చెందిన అంశాలపై విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను రూపొందించి టీ.శాట్ ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమాల రూపకల్పనపై ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రధానంగా రైతులకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ పామ్ సాగు, హరిత సంపద, పశుపోషణ తదితర అంశాలపై కార్యక్రమాలను రూపొంచాలని సూచించారు. పంచాయితీ రాజ్ కు సంబంధించి ఉత్తమ సర్పంచులు కావడానికి మార్గాలు, గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ ఆర్థిక వనరుల పెంపు లాంటి అంశాలు, యువజనులకు సంబంధించి పోటీ పరీక్షలకు తయారీ, కెరీర్ డెవలప్మెంట్, విద్యా పరమైన ప్రావీణ్యత తదితర అంశాలు, పోలీస్ నియామకాలకు సంబందించిన ప్రిపరేషన్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు,గంజాయి సాగు నిషేధం తదితర అంశాలపై కార్యక్రమాలను రూపొందించాలని సీఎస్ పేర్కొన్నారు.

కార్యక్రమాల రూపకల్పన, ప్రసారాలతో పాటు స్వీయ ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. వివిధ శాఖలకు దృశ్య, శ్రవణ కార్యక్రమాలను సాఫ్ట్ నెట్, టీ.శాట్ ల ద్వారా రూపొందించాలని సూచించారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆన్ లై క్లాసులను అందించడంలో టీ-శాట్ చేసిన కృషిని సీఎస్ అభినందించారు.

కార్మిక, సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమావేశం:
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరిని 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

నేడు బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో కార్మిక, సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు కార్మికులను సిటిజన్ సర్వీస్‌ సెంటర్లకు తరలించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి రిజిస్ట్రేషన్‌లను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. జిల్లా, గ్రామం, వార్డు స్థాయిలో వర్కర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సంబంధిత శాఖాధికారుల పర్యవేక్షణలో నమోదు పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీలు లక్ష్యసాధనకై రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేయాలని ఆదేశించారు.

ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదుపై అవగాహన శిబిరాలు నిర్వహించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగాల కార్మికులకు కల్పిస్తున్న ప్రయోజనాలను వివరించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ-శ్రమ్ పథకం కింద అసంఘటిత రంగాల కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, వికలాంగులైతే లక్ష రూపాయలు చెల్లిస్తారన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని, జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య, జిహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, కార్మిక శాఖ కమీషనర్ అహ్మద్ నదీమ్, సిడిఎంఏ సత్యనారాయణ, PR & RD కమీషనర్ ఏ. శరత్, ఎండీ టిఎస్ టిఎస్ జి.టి వెంకటేశ్వర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases