botswana: బోట్స్ వానాలో తీవ్ర కరవు.. ఎండిన కుంటల్లో హిప్పోల విలవిల!

  • ఎల్ నినో వల్ల వర్షాల్లేక తగ్గిన పంటల దిగుబడి
  • ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది ప్రజలు
  • ఇప్పటికే అత్యవసర పరిస్థితి ప్రకటించిన చాలా ఆఫ్రికా దేశాలు
Endangered Hippos Stuck In Dried Ponds In Drought Hit African Country

ఆఫ్రికా దేశమైన బోట్స్ వానాను తీవ్ర కరవు అల్లాడిస్తోంది. దీంతో వన్యప్రాణులు నీటి కోసం విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా నీటిలోనే ఎక్కువగా సేదతీరే హిప్పోపోటమస్ ల (నీటి గుర్రాలు) గుంపులు ఎండిన కుంటల్లో చిక్కుకుపోయాయి. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా బోట్స్ వానాలో కరవు తాండవిస్తోంది. వర్షాల్లేక పంటల దిగుబడి దెబ్బతినడంతో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చాలా దేశాలు ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.

ఉత్తర బోట్స్ వానాలో చిత్తడి నేలలతో కూడిన ఒకవాంగో డెల్టా సమీపంలో ప్రవహించే తమలాకేన్ నది ఎండిపోయింది. దీంతో అక్కడి హిప్పోల గుంపులు పర్యాటక పట్టణమైన మౌన్ కు క్యూ కట్టాయి.

“నది ఎండిపోవడంతో జంతువుల పరిస్థితి దారుణంగా ఉంది” అని బోట్స్ వానా రాజధాని గబరోన్ లో ఉన్న వన్యప్రాణి, జాతీయ పార్కుల శాఖ ప్రతినిధి లెసెగో మొసెకి తెలిపారు.

బోట్స్ వానా హిప్పోలకు పుట్టినిల్లు. అక్కడ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిప్పోలు జీవిస్తుంటాయి. సుమారు 2 వేల నుంచి 4 వేల హిప్పోలు బోట్స్ వానాలో ఉండొచ్చని ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ సంఘం (ఐయూసీఎన్) అంచనా వేసింది.

నదీ తీరం వెంబడి మొలిచే గడ్డి, మొక్కలు బాగా తగ్గిపోయాయి. దేశంలోని వాయవ్య ప్రాంత జిల్లా గమిల్యాండ్ లో హిప్పోలు ఒకవాంగో డెల్టాలో నీటి ప్రవాహంపై ఆధారపడి జీవిస్తాయి. ఇప్పుడు ఎండిన నీటి మడుగుల్లో ఎన్ని హిప్పోలు మరణించాయో చూడాల్సి ఉంది” అని మొసెకి తెలిపారు.

హిప్పోల చర్మం మందంగా ఉన్నప్పటికీ సున్నితమైనది. దీంతో చర్మం ఎండ వేడికి కమిలిపోకుండా అవి తరచూ నీటిలో స్నానం చేస్తాయి. హిప్పోలు ఎక్కువగా తేమ ప్రాంతాల్లో జీవిస్తాయి.

నీరు లేకపోవడం వల్ల హిప్పోలు దూకుడు స్వభావానికి గురికావొచ్చు. నీటి కోసం గ్రామాల్లోకి వచ్చేస్తుంటాయి. దీనివల్ల మనుషులతో పోరును నివారించేందుకు వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని స్థానిక అధికారులు అంటున్నారు.

ఎల్ నినో అనేది సహజ వాతావరణ పరిస్థితి. దీనివల్ల ప్రపంచమంతా వేడి పెరిగి కొన్ని ప్రాంతాలు కరవు బారినపడితే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

More Telugu News