వర్షాలపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ వర్ష ప్రాభావిత 20 జిల్లాల కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.

ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాల్లోని అధికారులందరూ కార్యస్థావరంలోనే ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయి.

ఈ నేపథ్యంలో అన్ని జలాశయాలపట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా చెరువుల కట్టల పటిష్టంపై తగు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే, ఎన్.డి.ఆర్.ఎఫ్. సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సోమేశ్ కుమార్ ఆదేశించారు. ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలపరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా లతోపాటు 20 జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

More Press Releases