USA: మూడు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు

  • ఇరాన్ ఆయుధాలను రష్యాకు అక్రమంగా పంపిణీ చేయడంలో సహకరించడమే కారణమన్న అగ్రరాజ్యం
  • మొత్తం 12కు పైగా కంపెనీలు, వ్యక్తులపై ఆంక్షల వేటు
  • అక్రమ వాణిజ్యంలో పాలుపంచుకున్నారని మండిపాటు
US imposes sanctions on three Indian companies

తమ పట్ల దూకుడు వైఖరితో వ్యవహరిస్తున్న ఇరాన్‌కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సాయపడ్డారనే కారణంతో పలు కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. అక్రమ వాణిజ్యంలో వీరు పాలుపంచుకున్నారని పేర్కొంది. ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇరాన్‌ మానవరహిత వైమానిక వాహనాలను అందజేసిందని అమెరికా ప్రస్తావించింది. అమెరికా గురువారం తీసుకున్న ఈ నిర్ణయంలో 12కు పైగా కంపెనీలపై ఆంక్షలు విధించగా అందులో 3 భారతీయ కంపెనీలు ఉన్నాయి.  

రష్యాకు అక్రమంగా ఆయుధాలను చేరవేయడంలో ఇరాన్ మిలిటరీ విభాగం ‘సహారా థండర్’ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. కాగా హిజ్బుల్లా, హమాస్, పాలస్థీనా ఇస్లామిక్ జిహాద్ వంటి ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్నందుకు ఇరాన్‌పై అమెరికా ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి రహస్య విక్రయాలను సులభతరం చేయడంలో, ఆర్థిక సహాయం అందించడంలో ఈ కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ప్రధాన పాత్ర పోషించాయని అమెరికా ట్రెజరీ విభాగం ప్రకటన విడుదల చేసింది. కాగా ఉక్రెయిన్‌లో తమ యుద్ధ అవసరాల కోసం ఉత్తరకొరియా, ఇరాన్ వంటి ఇతర దేశాల నుంచి రష్యా ఆయుధాలను సమకూర్చుకుందని అమెరికా ఆరోపించింది. 

భారత్‌కు చెందిన కంపెనీల్లో జెన్ షిప్పింగ్, పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీ ఆర్ట్ షిప్ మేనేజ్‌మెంట్  ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. కాగా ఇరాన్‌కు చెందిన సహారా థండర్ విభాగం తన దేశానికి చెందిన రక్షణమంత్రిత్వశాఖ, సాయుధ దళాలకు చెందిన ఆయుధాలను చైనా, రష్యా, వెనిజులా సహా పలు ఇతర దేశాలకు విక్రయించేందుకు భారీ షిప్పింగ్ నెట్‌వర్క్‌పై ఆధారపడుతుంది. ఈ విషయాన్ని యూఎస్ ట్రెజరీ తెలిపింది.

More Telugu News