Hyderabad: హైదరాబాదీలకు మరో పది రోజులపాటు ట్రాఫిక్ కష్టాలు

  • కార్ రేసింగ్ తో పాటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంక్షలు
  • వాహనాలతో కిక్కిరిసిపోతున్న రహదారులు
  • ఉల్లంఘనల వల్లే ట్రాఫిక్ కష్టాలంటున్న పోలీసులు
Traffic restrictions at Hyderabad for another 10 days due to Formula race

హైదరాబాద్ లో పది రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారికి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల కారణంగా ట్రాఫిక్ పోలీసులు అసెంబ్లీ ఏరియాలో వాహనాలను దారి మళ్లించారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తాజాగా నగరంలో ఫార్ములా కార్ రేస్ మొదలవుతుండడంతో టాంక్ బండ్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలలో రోడ్లను మూసేశారు. దీంతో రోడ్లపై వాహనాల కదలిక చాలా నెమ్మదించింది. కిలోమీటర్ దూరానికి గంట సమయం పడుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. 

మంగళ, బుధవారాలు ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులు, వీధులూ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్‌, ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభం, ఫిబ్రవరి 18న శివరాత్రి వేడుకలు ఇలా వరుస కార్యక్రమాల నేపథ్యంలో మరో 10 రోజులు ట్రాఫిక్ కష్టాలు తప్పవని తెలుస్తోంది.

గ్రేటర్ లో దాదాపు 80 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయని, ఇందులో రోజూ 30 నుంచి 40 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుందని వాహనదారులు చెప్పారు. అయితే, ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షల వల్ల కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి గంట పడుతోందని వాపోతున్నారు.

ట్రాఫిక్ కష్టాలపై పోలీసులు స్పందిస్తూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. సిటీలో రోజూ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 17 వేల చలానాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

More Telugu News