Karnataka: 205 కిలోల ఉల్లి పంటకు రూ.8.36 పైసలు.. కర్ణాటక రైతుకు వచ్చిన ఆదాయం ఇది!

  • 400 కి.మీ. దూరం తీసుకెళ్లి అమ్మితే వచ్చిన మొత్తం సొమ్ము ఇదంటూ రైతు ఆవేదన
  • దారిలో టీ తాగేందుకూ ఆ డబ్బు సరిపోదని నిర్వేదం
  • పెట్టుబడి ఖర్చు రూ.25 వేలకు పైనే అయిందని వెల్లడి
  • ట్విట్టర్ లో మార్కెట్ రిసీట్ ఫొటో వైరల్
Karnataka farmer earns Rs 8 for 205 kg of onions after travelling 415 km

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్మితే నాలుగు రూపాయలు కళ్లజూడొచ్చని రైతులు ఆశపడతారు. కొంచెం రేటు ఎక్కువ పలుకుతుందని తెలిస్తే దూరం ఎక్కువైనా సరే తన పంటను కష్టపడి తీసుకెళతారు. తీరా అక్కడ పంట మొత్తం అమ్మాక దారి ఖర్చులకూ సరిపడిన సొమ్ము కూడా అందకుంటే..? కర్ణాటకకు చెందిన ఓ రైతుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా.. ఆయనకు అందింది కేవలం రూ.8.36 పైసలు. అవును.. అక్షరాలా ఎనిమిది రూపాయల ముప్పై ఆరు పైసలు మాత్రమే! ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వివరాలు..

కర్ణాటకలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి ఉల్లి గడ్డ సాగుచేశారు. వర్షాలు ఎక్కువగా కురవడంతో దిగుబడితో పాటు నాణ్యత కూడా కొద్దిగా తగ్గింది. పంట నికరంగా 205 కిలోలు తేలింది. స్థానికంగా మంచి ధర పలకదనే ఉద్దేశంతో మరికొంతమంది రైతులతో కలిసి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వంత్ పూర్ మార్కెట్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా సరైన రేటు లేకపోయినా గత్యంతరం లేక, దారిఖర్చులకన్నా ఉపయోగపడతాయని క్వింటాల్ రూ.200 చొప్పున అమ్మేశాడు. అయితే, దారిఖర్చులకు కాదు కదా.. దారిలో టీ తాగేందుకు సరిపడా సొమ్ము కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

పంట మొత్తం తీసుకున్న వ్యాపారి లెక్కలు కట్టి తన చేతిలో రూ.8.36 పైసలు పెట్టడంతో పెవడెప్ప అవాక్కయ్యాడు. ఇదేంటని అడిగితే.. మొత్తం 205 కిలోలకు రూ.410. అందులో ఫ్రైట్ చార్జీలు రూ.377.64, హమాలీ ఖర్చు రూ.24 లను తీసేస్తే మిగిలేది రూ.8.36 పైసలేనని లెక్కచెప్పాడట. పంట పండించేందుకు తనకు సుమారు రూ.25 వేల దాకా ఖర్చయిందని రైతు చెప్పుకొచ్చాడు. తనలాగా మరో రైతు ఇబ్బంది పడకూడదని, యశ్వంత్ పూర్ మార్కెట్ కు రావొద్దని చెప్పాడు. కాగా, పెవడెప్ప పంట అమ్మకానికి సంబంధించిన రిసీట్ ను ఓ వ్యక్తి ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

More Telugu News