Uttar Pradesh: హ్యాండ్ బ్యాగ్​, లిప్​ స్టిక్​ దేనితోనైనా పేల్చవచ్చు.. భిన్నమైన రివాల్వర్లు తయారు చేసిన భారత యువకుడు.. వీడియో ఇదిగో

  • చెప్పుల రూపంలోనూ ఎయిర్ గన్ ను రూపొందించిన తీరు
  • జీపీఎస్ ఆధారిత చెవి కమ్మలు కూడా తయారు చేసిన యువకుడు
  • మూడింటినీ రూ.2,497 కే అందిస్తానని చెబుతున్న శ్యామ్ చౌరాసియా
  • త్వరలోనే వీటిని మార్కెట్లోకి తీసుకు వస్తానని వెల్లడి
UP man designs handbag sandal guns and GPS earrings for womens self defence

ఇంట్లోంచి బయటికి వెళితే మహిళలకు రక్షణ లేని పరిస్థితి. ఎక్కడికైనా వెళ్లి తిరిగి వస్తుంటే అల్లరి మూకలతో ఇబ్బంది. ఇక రాత్రుళ్లు అయితే సమస్య మరీ దారుణంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో యువతులు, మహిళల రక్షణకు భిన్నమైన ఉపకరణాలు ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ చౌరాసియా అనే యువకుడు వినూత్నమైన పరికరాలను రూపొందించాడు. ఆధునిక సాంకేతితను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన కిట్ ను కూడా రూపొందించాడు.

నిత్యం వాడే వస్తువుల్లో రివాల్వర్లు, జీపీఎస్ ట్రాకర్

  • మహిళలు నిత్యం ఉపయోగించే వస్తువుల రూపంలోనే ప్రత్యేకమైన కిట్ ను శ్యామ్ చౌరాసియా రూపొందించాడు. అందులో ఉన్నవి సాదాసీదా ఉపకరణాలు కాదు. రివాల్వర్, జీపీఎస్ ట్రాకర్లు కావడం గమనార్హం. ఈ కిట్ లో ఒక పర్సు, జత ఎత్తు చెప్పులు, చెవులకు పెట్టుకునే కమ్మలు ఉన్నాయి.
  • ఇందులో పర్సుకు ‘స్మార్ట్ పర్స్ గన్’గా పేరు పెట్టాడు. దీనికి ఓ వైపు ఉండే ఎరుపురంగు బటన్ ను నొక్కితే రివాల్వర్ పేలుతుంది. బిగ్గరగా ధ్వని వస్తుంది.
  • రెండో పరికరం కాళ్లకు వేసుకునే శాండల్స్ (ఎత్తు చెప్పులు) లో కూడా చిన్నపాటి రివాల్వర్ ను అమర్చాడు. దీనికి కూడా ఓ వైపు ఉండే బటన్ ను నొక్కితే రివాల్వర్  పేలుతుంది. అంతేకాదు దానిలో బ్లూటూత్ సదుపాయం ఉంది. స్మార్ట్ ఫోన్ తో బ్లూటూత్ సాయంతోనూ రివాల్వర్ ను పేల్చవచ్చు.
  • మూడోది చెవులకు పెట్టుకునే ప్రత్యేకమైన ఇయర్ రింగ్స్. ఇందులో జీపీఎస్ ట్రాకర్ తోపాటు అత్యవసర ఫోన్ కాల్ సదుపాయం ఉంది. సదరు మహిళలు తప్పిపోయినప్పుడు, వారు ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా.. ఈ జీపీఎస్ ట్రాకర్ల ద్వారా వారు ఎక్కడున్నారో గుర్తించడానికి వీలుంటుంది.
  • ఇక లిప్ స్టిక్ రూపంలో ఉండే చిన్నపాటి గన్ ను కూడా శ్యామ్ చౌరాసియా రూపొందించాడు. ఇది కూడా చిన్న బటన్ ను నొక్కితే పేలుతుంది.

మూడు పరికరాలు కలిపి రూ.2,497 కే..
  • అయితే ఈ తుపాకీలలో నిజమైన బుల్లెట్లు కాకుండా ఎయిర్ గన్ తరహా బుల్లెట్లను ఉపయోగించాడు. తుపాకీ కాల్చినప్పుడు వచ్చినట్టుగా బిగ్గరగా శబ్దం వస్తుందని, అందరి దృష్టినీ ఆకర్షిస్తుందని చౌరాసియా చెబుతున్నాడు.
  • ఈ పరికరాలన్నీ రీచార్జబుల్ అని.. ఒకసారి చార్జింగ్ చేస్తే రెండు వారాల పాటు వినియోగించుకోవచ్చని అంటున్నాడు.
  • ఈ మూడు పరికరాలను కలిపి రూ.2,497 కే అందిస్తానని చౌరాసియా చెబుతున్నాడు. అబ్దుల్ కలాం యూనివర్సిటీ ఇన్నోవేషన్ హబ్ సాయంతో వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరిస్తున్నాడు.

More Telugu News