CM Jagan: ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం గాడిదలు కాశారు?: చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

  • అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ
  • సీఎం జగన్ ప్రసంగం
  • కుప్పం రెవెన్యూ డివిజన్ పై బాబు లేఖ రాశారన్న జగన్
  • కుప్పం ప్రజల ఒత్తిడికి తలొగ్గారని ఎద్దేవా
CM Jagan fires on Chandrababu

అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా సీఎం జగన్ విపక్షనేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు తనకు లేఖ రాశారని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం గాడిదలు కాశారంటూ మండిపడ్డారు. కుప్పం ప్రజల ఒత్తిడి వల్ల రెవెన్యూ డివిజన్ పై తనను అడక్క తప్పలేదని అన్నారు. 

75 ఏళ్లలో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తే, తాము 13 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. వికేంద్రీకరణ అంటే ఇదేనని ఉద్ఘాటించారు. అమరావతిలో బినామీల కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విశాఖకు మాత్రమే కాదు, విజయవాడకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాకే విజయవాడలో అభివృద్ధి జరుగుతోందని, 65 శాతం నిధులు ఖర్చు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మరి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

వికేంద్రీకరణపై చంద్రబాబు మాటలు అర్థరహితం అని కొట్టిపారేశారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్ని మంచి ఫలితాలు ఉన్నాయో గోదావరి వరదల సమయంలో వెల్లడైందని, అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి వరదల నుంచి ప్రజలను ఆదుకున్నాయని సీఎం జగన్ వివరించారు. ఏ ఒక్క కుటుంబం కూడా తమకు వరద సాయం అందలేదని చెప్పలేదని వెల్లడించారు.

More Telugu News