SSLV-D1: ఇస్రో రాకెట్ ప్రయోగం విఫలం... శాస్త్రవేత్తల్లో తీవ్ర నిరాశ

  • ఈ ఉదయం నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ-డీ1
  • అస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలు
  • సెన్సార్ లోపమే కారణమన్న ఇస్రో
  • యావత్ ప్రయోగం అంచనాలను అందుకోలేకపోయిందని వెల్లడి
ISRO says SSLV D1 mission not met the expectations

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉదయం నింగిలోకి దూసుకెళ్లి ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. తనతో పాటు మోసుకెళ్లిన ఈఓఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో కాకుండా, అస్థిరకక్ష్యలో ప్రవేశపెట్టినట్టు ఇస్రో తాజాగా గుర్తించింది. ఇవాళ్టి రాకెట్ ప్రయోగం విఫలమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఆ ఉపగ్రహాల వల్ల ఎంతమాత్రం ఉపయోగంలేదని ఇస్రో స్పష్టం చేసింది. 

మొత్తమ్మీద నేటి ప్రయోగం అంచనాలను అందుకోలేకపోయిందని వెల్లడించింది. దీనికంతటికీ కారణం ఓ సెన్సార్ పనితీరులో లోపమేనని ఇస్రో తెలిపింది. అందుకే ఉపగ్రహాలు తప్పుడు కక్ష్యలో ప్రవేశించాయని పేర్కొంది. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ సిఫారసుల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ఇస్రో వివరించింది. 

ఈ ఉదయం 9.18 గంటలకు రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లగా, ఎంతకీ డేటా అందకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైందన్న అనుమానాలు కలిగాయి. ఇస్రో స్పందిస్తూ, డేటా ప్రసారానికి అంతరాయం కలిగిందని, కొన్ని గంటల తర్వాత ప్రయోగం విజయవంతం అయిందా, లేదా అన్నదానిపై ప్రకటన చేస్తామని వెల్లడించింది. కానీ అందరినీ నిరాశకు గురిచేస్తూ ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమైందని ఇస్రో తాజా ప్రకటన చేసింది.

More Telugu News