India: ప్రపంచ అథ్లెటిక్స్ లో అరుదైన రికార్డు సృష్టించిన భారత లాంగ్ జంపర్ శ్రీ శంకర్

  • పురుషుల లాంగ్ జంప్ లో ఫైనల్ చేరిన భారత పురుష అథ్లెట్ గా ఘనత
  • స్టీపుల్ ఛేజ్ లో ఫైనల్ కు అర్హత సాధించిన అవినాశ్ 
  • ఈ టోర్నీ చరిత్రలో భారత్ కు ఇప్పటిదాకా ఒకే ఒక్క పతకం
Murali Sreeshankar becomes first ever Indian to qualify for mens long jump final at World Championships

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో ఫైనల్ చేరిన భారత తొలి పురుష లాంగ్ జంపర్ గా రికార్డు సృష్టించాడు. శ్రీశంకర్ తోపాటు అవినాశ్ సాబ్లే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ పతక రౌండ్ కు అర్హత సాధించాడు. 

ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న శ్రీశంకర్ శనివారం తెల్లవారుజామున జరిగిన పురుషుల లాంగ్ జంప్ అర్హత పోటీల్లో ఎనిమిది మీటర్ల దూరం దూకాడు. తన సమీప పోటీదారులైన జెస్విన్ ఆల్డ్రిన్ (7.79 మీటర్లు), ముహమ్మద్ అనీస్ యాహియా (7.73 మీ) కంటే ముందుగా 8 మీటర్లు దూకి నేరుగా ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. 

శ్రీశంకర్ మే నెలలో అత్యధికంగా 8.36 మీటర్ల మార్కు అందుకున్న నేపథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పతకం సాధించే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ నుంచి ఇప్పటిదాకా అంజూ బాబీ జార్జ్ (లాంగ్ జంపర్) ఏకైక కాంస్య పతకం గెలిచింది. ఇక, భారత ఆర్మీ క్రీడాకారుడైన అవినాశ్ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో 8:18.75 టైమింగ్‌తో హీట్స్ లో మూడో స్థానంలో నిలిచి నేరుగా పతక రౌండ్ కు అర్హత సాధించాడు.

More Telugu News