Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. 1,345 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్!

  • 417 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • లాభాలను మూటకట్టుకున్న అన్ని సూచీలు
  • తొలిరోజే నిరాశపరిచిన ఎల్ఐసీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,345 పాయింట్లు లాభపడి 54,318కి చేరుకుంది. నిఫ్టీ 417 పాయింట్లు పెరిగి 16,259కి ఎగబాకింది. ఈ క్రమంలో ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. 

ఇక మెటల్ సూచీ 7 శాతానికి పైగా, ఎనర్జీ సూచీ 4 శాతానికి పైగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఉన్న అన్ని కంపెనీలు లాభపడ్డాయి. టాటా స్టీల్ (7.67%), రిలయన్స్ (4.43%), ఐటీసీ (4.37%), విప్రో (4.23%), ఎల్ అండ్ టీ (4.00%) టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. మరోవైపు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎల్ఐసీ మాత్రం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. 

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు మార్కెట్లు భారీగా లాభపడటానికి కారణమయ్యాయి. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. మన దేశంలోకి రుతుపవనాలు సరైన సమయంలో ప్రవేశించడంతో... ఈ ఏడాది వ్యవసాయరంగం పుంజుకుంటుందనే అంచనాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. జీఎస్టీ వసూళ్లు జీవనకాల గరిష్ఠాన్ని తాకడం సానుకూలతను మరింత పెంచింది. మన దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో అన్ని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇది కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది.

More Telugu News