COVID19: రెండేళ్లపాటు కరోనా రోగులను తాకుతూ, చికిత్స చేసినా.. మహమ్మారి బారిన పడని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్

  • నాలుగు సార్లు టెస్ట్ చేసుకున్నా సూపరింటెండెంట్ రాజారావుకు నెగెటివ్
  • యాంటీ బాడీ టెస్టుల్లోనూ నెగెటివే
  • ఆయన ఫ్యామిలీకీ సోకని మహమ్మారి
  • ఓ ఇంటర్వ్యూలో వివరాలు పంచుకున్న రాజారావు
Gandhi Superintendent Raj Rao Never Have Covid Even He Hugs Covid Patients

మన ఇంటి పక్కన ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తేనే హడలెత్తిపోతున్న రోజులివి. కరోనా వచ్చిన వాళ్లను కాంటాక్ట్ అయితే.. మహమ్మారి రాకపోయినా వచ్చిందేమోనన్న భయంతో బతకాల్సిన కాలమిది. అలాంటిది కరోనాకు నోడల్ ఆసుపత్రి అయిన గాంధీలో రెండేళ్ల పాటు కరోనా రోగుల మధ్యే ఉన్న ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ఇంకెంత భయపడి ఉండాలి? ఇంతకాలం ఆయన కరోనా పేషెంట్ల మధ్యే ఉన్నా.. ఒక్కసారి కూడా కరోనా బారిన పడలేదంటే నమ్మగలరా? 

అవును, వాళ్లు..వీళ్లు అన్న తేడా లేకుండా అందరికీ వ్యాపించేస్తున్న ఒమిక్రాన్ కూడా ఆయన్ను టచ్ చేయలేకపోయిందట. ఊరికే చెబుతున్న మాట కాదిది. కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు చికిత్స చేసి.. టెస్ట్ చేయించుకున్నా ఆయనకు పాజిటివ్ రాలేదట. వివిధ సందర్భాల్లో 4 సార్లు టెస్ట్ చేయించుకున్నా కరోనా నెగెటివ్ గానే రిపోర్ట్ వచ్చిందట. అంతెందుకు.. ప్రతిరక్షకాల పరీక్ష చేయించుకున్నా నెగెటివ్ వచ్చిందట. 

‘‘కరోనా వచ్చిన మొదట్లో పీపీఈ కిట్లు వాడేవాళ్లం. నేను దానితో పాటు డబుల్ మాస్క్ వేసుకున్నా. తరచూ చేతులు శుభ్రం చేసుకున్నాను. విటమిన్లు తీసుకున్నా. ఆహారంలో రోజూ కోడిగుడ్లు, వారంలో ఒకసారి మాంసం ఉండేలా చూసుకున్నా. దాని వల్ల నేను బరువు కూడా పెరిగా’’ అంటూ రాజారావు తన ఆరోగ్య రహస్యం చెప్పుకొచ్చారు.   

కాగా, 2020లో కరోనా తొలి కేసు నమోదైనప్పటి నుంచి గాంధీలోని స్టాఫ్ అందరిలాగానే తానూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ఆయన చెప్పారు. గాంధీలోనే ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసి.. అక్కడే 1998లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధుల్లో చేరానని ఆయన గుర్తు చేసుకున్నారు. అక్కడి నుంచి అంచలంచెలుగా ఎదిగి 2020 ఏప్రిల్ లో సూపరింటెండెంట్ గా బాధ్యతలు అందుకున్నానని పేర్కొన్నారు. 

కరోనా వచ్చినప్పటి నుంచి తాను 8 వేల మందికిపైగా కరోనా పేషెంట్లను తాకానని, చాలా మంది భావోద్వేగంతో తనను కౌగిలించుకున్నారని గుర్తు చేశారు. కరోనా తొలినాళ్లలో కరోనా చికిత్సకు ఒకే ఒక్క ఆసుపత్రి గాంధీ అని, అమెరికాలోని వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వైద్యం అందించామని చెప్పారు. తాను పేషెంట్లను తాకుతున్నానని చెప్పినప్పుడు.. కరోనా వచ్చే ప్రమాదముందంటూ చాలా మంది నిపుణులు హెచ్చరించారని గుర్తు చేశారు. 

అయితే, ఇప్పటిదాకా తనకు కరోనానే సోకలేదని, తన భార్య, కుమారుడు, కూతురుకు కూడా రాలేదని ఆయన చెప్పారు. అదెలా సాధ్యమైందన్న విషయం ఇప్పటికీ తనను ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఆ సమయంలో తాను ప్రత్యేకమైన గదిలో ఉండేవాడినని, ఒంటరిగా వెళ్లేవాడినని, తన బట్టలు తానే ఉతుక్కునేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆ రోజులన్నీ వింత అనుభవాలనిచ్చాయన్నారు. లాక్ డౌన్ కాలంలో.. రోడ్లపై ట్రాఫిక్ ఉంటే బాగుండును అని దేవుడిని కోరుకున్న సందర్భాలున్నాయన్నారు. 

హైదరాబాద్ కు చెందిన ఓ బాడీ బిల్డర్ కరోనాతో చనిపోవడం తనను కదిలించిందని చెప్పారు. అతడి చివరి రోజుల్లో ఎంతో ధైర్యం చెప్పానని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రోజు అతడి బెడ్ దగ్గరికి వెళ్లి ముట్టుకున్నానని, చలనం లేకుండా పక్కకు పడిపోయాడని, అప్పుడు దు:ఖాన్ని ఆపుకోలేకపోయానని ఆవేదన చెందారు. కరోనా నుంచి కోలుకున్న ఎంతో మంది తనకు ప్రేమతో ఎన్నో ఇచ్చారన్నారు. 

తాను నిజానికి దేవుడిని నమ్మనని, కానీ, రోడ్డు ప్రమాదంలో గాయపడి చాన్నాళ్ల పాటు కోమాలో ఉన్న తన కుమారుడు మామూలు మనిషిగా మారి ఎంబీబీఎస్ లో చేరినప్పటి నుంచి తన ఆలోచనలు మారిపోయాయని తెలిపారు. తన కుమారుడు దాదాపు 6 నెలల చికిత్స తర్వాత కోమా నుంచి బయటపడ్డాడన్నారు.

More Telugu News