Ishan Kishan: పవర్ ప్లే తర్వాత ఇషాన్ ఆకట్టుకునే ఇన్నింగ్స్: రోహిత్ శర్మ

  • గతంలో ఇలా ఆడడానికి ఇబ్బంది పడేవాడు
  • అతడి సామర్థ్యాలు తనకు తెలుసన్న రోహిత్
  • జడేజా నుంచి మరింత ఆశిస్తున్నట్టు ప్రకటన
  • అందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపినట్టు వెల్లడి
Ishan Kishan constructed innings well after Powerplay which is usually challenge for him

శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆట తీరును, మరో ఓపెనర్, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతగానో మెచ్చుకున్నాడు. పవర్ ప్లే తర్వాత ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ నిర్మించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్టు రోహిత్ చెప్పాడు. గతంలో అతడు ఈ విషయంలోనే సమస్యను ఎదుర్కొనే వాడని తెలిపాడు.

23 ఏళ్ల ఝార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ వచ్చిన ప్రతి బంతిని చితక్కొట్టి 89 పరుగులు (62 బంతుల్లో) రాబట్టుకోవడం ప్రేక్షకులకు మంచి కిక్ ను ఇచ్చింది. ‘‘ఇషాన్ గురించి నాకు ఎంతో కాలంగా తెలుసు. ఐపీఎల్ లో ఒకే ఫ్రాంచైజీకి మేము ఇద్దరం ఆడుతున్నాం. ఇషాన్ మైండ్ సెట్, సామర్థ్యాలపై అవగాహన ఉంది. అతడు తిరిగి గాడిలో పడ్డాడు. అతడి బ్యాటింగ్ చూడ్డానికి ఎంతో బాగుంది. ఆరు ఓవర్ల తర్వాత ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ను చక్కగా నిర్మించాడు’’ అని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తన అభిప్రాయాలను వెల్లడించాడు.

రెండు నెలల విరామం తర్వాత ఆర్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడంపై రోహిత్ స్పందిస్తూ.. టీ20ల్లో జడేజా బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ముందుగా రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. ‘‘జడేజా తిరిగి రావడం సంతోషం. అతడి నుంచి ఎంతో ఆశిస్తున్నాం. అందుకే అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపించాం. రానున్న మ్యాచ్ లలోనూ ఇదే చూస్తారు. టెస్ట్ లో అతడి పనితీరు నిలకడగా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచుల్లోనూ అదే కోరుకుంటున్నాం’’ అని రోహిత్ వివరించాడు.

More Telugu News