Rajamouli: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబులకు కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి

  • సంక్రాంతి బరి నుంచి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ అవుట్
  • అదే బాటలో ఎఫ్3
  • ట్విట్టర్ లో స్పందించిన రాజమౌళి
  • సహృదయంతో నిర్ణయం తీసుకున్నారని వెల్లడి
Rajamouli thanked Mahesh Babu and Pawan Kalyan

ఈ సంక్రాంతి సీజన్ కు అనేక పెద్ద సినిమాలు క్యూలో ఉండడంతో హోరాహోరీ తప్పదని భావించారు. అయితే అనూహ్య రీతిలో సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్3 చిత్రాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మాత్రం ముందు ప్రకటించినట్టుగా జనవరి 7న విడుదల అవుతోంది.

ఈ నేపథ్యంలో, దర్శకుడు రాజమౌళి స్పందించారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నిర్మాత దిల్ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు.

"వాస్తవానికి మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ పొంగల్ సీజన్ లో తప్పక విడుదల అవ్వాల్సిన సినిమా. కానీ మహేశ్ బాబు ఎంతో సుహృద్భావపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి బరిలో గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో తన చిత్రం విడుదలను వేసవికి వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి బరిలో అనేక చిత్రాలు ఉండగా, సర్కారు వారి పాటను వాయిదా వేయాలని మొదటగా మహేశ్ బాబే నిర్ణయం తీసుకుని స్ఫూర్తిగా నిలిచారు. నా హీరోకు, మైత్రీ మూవీ మేకర్స్ కు, యావత్ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇక, భీమ్లా నాయక్ విషయంలో చినబాబు గారు, పవన్ కల్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గదే. వారు తమ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. భీమ్లా నాయక్ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్. అటు, ఎఫ్3 సినిమా విడుదలను మరో తేదీకి మార్చుకున్నందుకు దిల్ రాజు గారికి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు కృతజ్ఞతలు" అంటూ రాజమౌళి ట్వీట్లు చేశారు.

More Telugu News