DRDO: పాక్​ కు క్షిపణుల రహస్య సమాచారం.. నలుగురు డీఆర్డీవో ఉద్యోగుల అరెస్ట్​

  • హనీ ట్రాప్ చేసిన పాక్ ఏజెంట్లు
  • ముందుగా ఫేస్ బుక్ మెసెంజర్ లో చాటింగ్
  • ఆ తర్వాత వాట్సాప్ లో వాయిస్, వీడియో కాల్స్
  • సమాచారం ఇచ్చినందుకు భారీగా డబ్బు
Four DRDO Employees Arrested For Alleged Transfer Of Classified Information To Pak

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)లో మరోసారి గూఢచర్యం కలకలం రేగింది. పాకిస్థాన్ కు ఆర్మీకి సంబంధించిన రహస్య సమాచారం చేరవేశారన్న ఆరోపణలతో నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ అయిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో పనిచేస్తున్న ఆ ఉద్యోగులకు పాక్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని, పక్కా సమాచారంతోనే వారిని అరెస్ట్ చేశామని ఈస్టర్న్ రేంజ్ ఐజీ హిమాన్షు లాల్ తెలిపారు.  

ఐటీఆర్ లో జరుగుతున్న క్షిపణి ప్రయోగాలకు సంబంధించి వారిని హనీ ట్రాప్ చేశారని, వారు ఆ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ కు అందజేశారని చెప్పారు. మొదట వారికి ఫేస్ బుక్ మెసెంజర్ లో పాక్ ఏజెంట్ల నుంచి సందేశాలు వచ్చాయని, ఆ తర్వాత వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ లో మాట్లాడుకున్నారని చెప్పారు. ఏజెంట్లు తప్పు పేర్లతో పరిచయం చేసుకుని వారిని ఉచ్చులోకి లాగారని అన్నారు. సమాచారం ఇచ్చినందుకు డబ్బులు కూడా పంపారన్నారు. మూడు రోజుల పాటు అధికారులు వారిని ఫాలో అయ్యాకే అరెస్ట్ చేశామని చెప్పారు.

కాగా, అంతకుముందు 2015 జనవరి 23న పాకిస్థాన్ కు రహస్య సమాచారం చేరవేశాడన్న ఆరోపణలతో ఈశ్వర్ చంద్ర బెహెరా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 11న కోర్టు అతనికి జీవిత ఖైదును విధించింది. డీఆర్డీవోలో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన అతడికి మిసైల్స్ కు సంబంధించిన రహస్య సమాచారం ఇచ్చినందుకుగానూ అబుధాబీ, మీరట్, ముంబై, బీహార్, ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బు ముట్టినట్టు ఆధారాలూ వెలుగు చూశాయి.

More Telugu News