postal stamp: కొత్త పోస్టల్ స్టాంప్ డిజైన్ చేయండి... బహుమతి కొట్టండి!

  • పోస్టల్ స్టాంప్ డిజైన్ కు బహుమతి ప్రకటించిన ప్రభుత్వం
  • సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో సాధించిన విజయాలతో స్టాంప్
  • ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా పోటీ
Here is the center bumper offer to win cash prize

డిజైనింగ్ రంగంలో అనుభవం, నైపుణ్యాలు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను డిజైన్ చేస్తే రూ.15 వేల వరకూ నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ట్వీట్ చేసింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన అతిపెద్ద విజయాల వివరాలతో కూడిన పోస్టల్ స్టాంప్ తయారు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈ స్టాంప్ రూపకల్పన కోసం సృజనాత్మకత ఉన్న వారందరికీ ట్విట్టర్ వేదికగా ఆహ్వానం పంపింది. భారతదేశం ఇటీవలే 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజ్ఞాన్ ప్రసార్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా ఈ పోటీని రూపొందించాయి.
 
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీలో పాల్గొనదలచుకున్న వారు www.mygov.in వెబ్‌సైటులో తమ పేరుతో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ పోటీలో పాల్గొనేందుకు చివరి తేదీ సెప్టెంబరు 15. పోటీలో తొలి స్థానంలో నిలిచిన వారికి రూ.15 వేలు, రెండో స్థానం గెలిచిన వారికి రూ.10 వేలు, మూడో స్థానంలో నిలిచిన వాళ్లకు రూ.5 వేలు నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటితోపాటుగా కన్సోలేషన్ బహుమతుల రూపంలో ముగ్గురికి రూ.2 వేల చొప్పున అందజేయనుంది.

More Telugu News