Vishnu Vardhan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమకు అన్యాయం చేయాలనుకోవడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి

  • ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు
  • అమీతుమీకి తెలంగాణ సిద్ధమంటూ కథనాలు
  • ఘాటుగా స్పందించిన విష్ణు
  • జగన్ ఎందుకు స్పందించడంలేదని నిలదీత
Vishnu Vardhan Reddy fires on CM KCR and CM Jagan

జలవనరుల విషయంలో ఏపీతో తాడేపేడో తేల్చుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయించుకున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కరవులో ఉన్న సీమ రైతులు సముద్రంలో కలిసే జలాలను వాడుకుంటే అడ్డుకోవాలని తెలంగాణ క్యాబినెట్ భేటీలో చర్చించడం బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. ప్రాంతాలుగా విడిపోదాం-ప్రజలందరం అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అని విభజన సమయంలో చెప్పారని, అది ఇదేనా? అని విష్ణు ప్రశ్నించారు.

"శ్రీశైలంలో వేల ఎకరాలు ఇచ్చి, మా భూములు కోల్పోయాం. ముంపు మాకు... నీళ్లు మీకు ఇస్తున్నాం. మేం కూడా మా భూమి, మా నీళ్లు అంటే మీరు అంగీకరిస్తారా?" అని నిలదీశారు.

"ఏపీ సీఎం జగన్ గారూ, మీరు తెలంగాణ క్యాబినెట్ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడంలేదు? మీ రెండు పార్టీల మధ్య సంబంధాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను బలిచేస్తారా? రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలారా.... తెలంగాణలో మీ వ్యాపారాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడతారా? రాయలసీమ నీటి ప్రాజెక్టులు, రాజోలిబండ (ఆర్డీఎస్) అక్రమ ప్రాజెక్టులు అని కేసీఆర్ ఆరోపణలు చేస్తుంటే, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై మీరెందుకు మాట్లాడడంలేదు? రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులు అయితే, తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా?" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News