Etela Rajender: అందుకే క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి: ఈట‌ల‌

  • వైర‌స్ బాధితుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు
  • వైర‌స్ సోకిన 3-4 రోజుల‌కు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి
  • టీకాలు లేక ఈ రోజు వ్యాక్సినేష‌న్ నిలిచిపోయింది
  • ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు  
eetala on corona cases

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బాధితుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వైర‌స్ సోకిన 3-4 రోజుల‌కు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని తెలిపారు. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డంతోనే ఒక‌రి నుంచి క‌రోనా మ‌రొక‌రికి త్వ‌ర‌గా వ్యాపిస్తోంద‌న్నారు. టీకాలు లేక ఈ రోజు వ్యాక్సినేష‌న్ నిలిచిపోయింద‌ని, ఈ రోజు రాత్రికి 2.7 ల‌క్ష‌ల టీకాలు రాష్ట్రానికి వ‌స్తాయ‌ని తెలిపారు.

తెలంగాణకు సరిపడా టీకా డోసులు కేంద్ర ప్ర‌భుత్వం పంపుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పరిశ్రమలకు సరఫరా తగ్గించి ఆరోగ్య రంగానికి కేటాయించాలని అధికారులను ఆదేశించామ‌ని వివ‌రించారు.  ఆక్సిజన్ ఉత్పత్తి అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోలేవని తెలిపారు.

తెలంగాణలోని ఆసుప‌త్రుల్లో బెడ్స్ కొరత లేదని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఐదు ఆసుప‌త్రుల్లోనే బెడ్లు నిండిపోయాయని, ఇంకా 60 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయని  తెలిపారు. తెలంగాణ‌లో లాక్‌డౌన్ లేక‌ కర్ఫ్యూ విధించే అవకాశాలు లేవ‌ని వివ‌రించారు. అంద‌రూ క‌రోనా నిబంధ‌న‌లను పాటించాల‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News