Ayyanna Patrudu: విషం కంటే ప్రమాదకరమైన బ్రాండ్లు తయారుచేసి జనాల జేబులు కత్తిరిస్తున్నాడు: సీఎం జగన్ పై అయ్యన్న విసుర్లు

  • ఏపీలో క్రమంగా మద్య నిషేధం తెస్తామన్న సర్కారు
  • దారుణమైన బ్రాండ్లు అంటూ టీడీపీ ధ్వజం
  • 2019లో లిక్కర్ ఆదాయం రూ.5 వేల కోట్లు అని అయ్యన్న వెల్లడి
  • ఇప్పుడది రూ.10 వేల కోట్లకు చేరిందని వివరణ
  • దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం
Ayyanna Patrudu fires on CM Jagan over liquor brands

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అయితే, మద్యం దుకాణాల్లో అమ్ముతున్న బ్రాండ్లపై విపక్ష టీడీపీ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తోంది. మద్య నిషేధం అంటూనే దారుణమైన బ్రాండ్లతో ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇదే అంశంలో ఘాటుగా స్పందించారు. జగన్ రెడ్డి మద్యపాన నిషేధం అంటూనే మహిళల మెడలో పుస్తెలు కూడా లాగేస్తున్నాడని విమర్శించారు. విషం కంటే ప్రమాదకరమైన బ్రాండ్లు తీసుకువస్తూ జనాల జేబులు కత్తిరిస్తున్నాడని వ్యాఖ్యానించారు.

2019లో లిక్కర్ ఆదాయం రూ.5 వేల కోట్లు ఉండగా, ఇప్పుడు 2021లో అది రూ.10 వేల కోట్లకు చేరిందని అయ్యన్న వెల్లడించారు. మద్యం పేరుతో రూ.10 వేల కోట్లు దోపిడీ చేస్తూ మద్యపాన నిషేధం అంటూ కటింగ్ ఇవ్వడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లింది అంటూ విమర్శించారు. టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది అని బులుగు బ్యాచ్ చొక్కాలు చించుకుంటారని, కానీ ఇవి తాము చేస్తున్న ఆరోపణలు కాదని, కాగ్ బయటపెట్టిన జగన్ రెడ్డి భాగోతం అని అయ్యన్న పేర్కొన్నారు.

More Telugu News