Lightning: మీదొచ్చి పడిన పిడుగు.. ఉన్నచోటే కుప్పకూలిన నలుగురు

  • అదృష్టం కొద్దీ ముగ్గురికి తప్పిన ప్రాణాపాయం
  • మరో వ్యక్తి పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
  • గురుగ్రామ్ లోని ఓ విల్లాస్ లో ఘటన
  • ఏటా పిడుగులకు 2 వేల మంది బలి
Struck by lightning 4 men in Gurugram live to tell their tale

ఏ టైమ్ ఎట్లొస్తుందో ఎవరికి తెలుసు? శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఒళ్లు గగుర్పొడిచే ఘటనను చూస్తే అదే అనిపిస్తుంది. మృత్యువు మీదొచ్చి పడినా.. అదృష్టం కొద్దీ బతికిబయటపడ్డారు. అవును, వేల వోల్టుల శక్తి ఉన్న పిడుగు మీదొచ్చి పడితే.. ఉన్న ప్రాణం ఉన్న చోటునే పోదూ! ఓ నలుగురు తోటమాలులకూ అదే పరిస్థితి ఎదురైంది. గురుగ్రామ్ సెక్టార్ 82లోని వాటికా సిగ్నేచర్ విల్లాస్ లో ఈ ఘటన జరిగింది.

నిన్నల్లా ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసిన సంగతి తెలిసిందే. వర్షం పడుతోందని భావించిన సదరు విల్లాస్ లో పనిచేసే ఆ నలుగురు తోటమాలులు ఓ చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. వాళ్లు వెళ్లి అలా నిలబడ్డారో లేదో.. కాసేపటికే ఆ చెట్టుపై బడబడమంటూ పిడుగు పడింది. నలుగురు వ్యక్తులు ఉన్న చోటనే కుప్పకూలిపోయారు. అదృష్టం కొద్దీ వారు బతికే ఉండడంతో మనేసర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అందులో ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను శివదత్, లాలి, రాంప్రసాద్ సుందర్, అనిల్ గా గుర్తించారు. కాగా, గత ఏడాది జూన్ లో పిడుగులు పడిన ఘటనల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క బీహార్ లోనే 82 మంది చనిపోయారు. జాతీయ నేర గణాంక బ్యూరో 2018 నివేదిక ప్రకారం.. 2005 నుంచి ఏటా 2 వేల మందికిపైగా దేశంలో పిడుగులకు బలైపోతున్నారు.

More Telugu News