Farm Laws: ఖలిస్థాన్​ పోరు అక్కడి నుంచే మొదలవుతుంది: గ్రెటా పోస్ట్​ చేసిన ‘టూల్​ కిట్​’ సూత్రధారి మో ధలివాల్​

  • జనవరి 26న కెనడా వాంకోవర్ దౌత్యకార్యాలయం వద్ద నిరసనలు
  • సాగు చట్టాలు రద్దు చేసినా పోరు ఆగదని వ్యాఖ్యలు
  • పంజాబ్, ఖలిస్థాన్ వేరు కాదంటూ రెచ్చగొట్టే ప్రయత్నం
  • అతడిపై దృష్టి సారించిన ఢిల్లీ పోలీసులు
Mo Dhaliwal Man behind Greta toolkit a self confessed Khalistani

రైతుల నిరసనలకు మద్దతుగా ఇప్పటికే పాప్ గాయకురాలు రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ లు ట్వీట్లు చేశారు. గ్రెటా థన్ బర్గ్ ఏకంగా ఖలిస్థాన్ కు సంబంధించి ఓ గూగుల్ టూల్ కిట్ లింక్ ను షేర్ చేసింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఆ టూల్ కిట్ వెనుక ఉన్నది ఖలిస్థానీ అని చెప్పుకొనే మో ధలివాల్. కెనడాలో పుట్టి పెరిగిన అతడిపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు.

అంతేకాదు, జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ నిరసనల సందర్భంగా కూడా అతడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. కెనడాలోని వాంకోవర్ లో భారత దౌత్యకార్యాలయం ముందు నిరసనల్లో పాల్గొన్నాడు. ఖలిస్థాన్ ఉద్యమం నుంచి తమను వేరు చేయలేరని అన్నాడు.

‘‘ఇప్పటికిప్పుడు భారత ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసినా మనం గెలిచినట్టు కాదు. ఆ పోరు అక్కడితో ముగిసిపోదు. అసలైన పోరు సాగు చట్టాల రద్దు నుంచే మొదలవుతుంది. పోరు ముగిసిందని ఎవరు చెప్పినా వినకూడదు. మనలోని శక్తిని హరించాలని చూసేందుకు చాలా మంది అలాంటి మాటలే చెబుతారు. పంజాబ్ వేరు.. ఖలిస్థాన్ వేరు అని మాయ చేస్తారు. కానీ, మీరంతా వేరు కాదు.. ఒక్కటే’’ అంటూ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కన్నేసిన పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ తో అతడికి సంబంధాలున్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రెటా థన్ బర్గ్ ట్వీట్ చేసిన టూల్ కిట్ ఆ సంస్థ తయారు చేసినదే. అనితా లాల్ అనే తన స్నేహితురాలు ఈ ఫౌండేషన్ ను స్థాపించినట్టు ఓ ఫేస్ బుక్ పోస్టులో ధలివాల్ పేర్కొన్నాడు. ఇక, గత ఏడాది సెప్టెంబర్ 17న కూడా ఖలిస్థాన్ కు సంబంధించి అతడు ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

‘‘నేను ఖలిస్థానీని. మీలో చాలా మందికి దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు? ఖలిస్థాన్ అంటే ఓ సిద్ధాంతం. ఖలిస్థాన్ అంటే జీవం ఉన్న బతుకు పోరాటం. బానిసత్వంలో మగ్గి బతికే కన్నా చావు మేలు అని అర్థం చేసుకున్నప్పుడే బానిస బతుకుల నుంచి విముక్తి కలుగుతుంది’’ అంటూ రాసుకొచ్చాడు.

పంజాబ్ బర్నాలా జిల్లాలోని థిక్రివాల్ గ్రామానికి చెందిన ఎన్డీపీ సభ్యుడు జగ్మీత్ సింగ్ ధలివాల్ తో దిగిన ఫొటోనూ అతడు పోస్ట్ చేశాడు. అయితే, తమకు జగ్మీత్ గురించి తెలిసినా.. మో గురించి మాత్రం తెలియదని గ్రామస్థులు తేల్చి చెప్పారు. అతడితో తమకు ఏ సంబంధమూ లేదని ఇటు రైతు సంఘాల నేతలూ ప్రకటించారు.

More Telugu News