Facebook: ప్రియురాలు ఎవరూ దొరకడం లేదని.. ఫేస్‌బుక్‌లో తనను తాను అమ్మకానికి పెట్టుకున్న యువకుడు!

  • పదేళ్లుగా ప్రేమికురాలి కోసం గాలింపు
  • సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో వెతికినా ఫలితం శూన్యం
  • అమ్మకానికి పెట్టుకుని ఆశగా ఎదురుచూస్తున్న కుర్రాడు
Young man selling him self in facebook

ఒక్క అమ్మాయితోనైనా జట్టు కట్టాలని భావిస్తూ పదేళ్లుగా వెతుకుతున్న ఓ అబ్బాయి చివరికి విసిగి వేసారి ఫేస్‌బుక్‌లో తనను తాను అమ్మకానికి పెట్టుకున్నాడు. బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌షైర్‌లో జరిగిందీ ఘటన. వృత్తిరీత్యా లారీ డ్రైవర్ అయిన అలెన్ క్లేటన్ దశాబ్దకాలంగా తనను ప్రేమించే అమ్మాయి కోసం వెతుకుతున్నాడు.  ఫలితం లేకపోవడంతో ఆశ చావక సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌లలో గాలించాడు.  మళ్లీ నిరాశే. ఇక తనను ప్రేమించేవారు దొరకరని డిసైడైపోయాడు. లాభం లేదని తనను తాను అమ్మకానికి పెట్టుకున్నాడు.

ఫేస్‌బుక్ క్లాసిఫైడ్‌తో తనను తాను అమ్మకానికి పెట్టుకుంటూ క్లేటన్ ఇలా రాసుకొచ్చాడు. తన పేరు అలెన్ అని, తనకు 30 సంవత్సరాలని పేర్కొన్నాడు. అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నానని చెప్పుకొచ్చాడు. చాలా వరకు పెళ్లిళ్లకు హాజరు కావాల్సి ఉందని, అయితే ఒంటరిగా వెళ్లడం తనకు ఇష్టం లేదన్నాడు. డేటింగ్ సైట్లలో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నానని రాసుకొచ్చాడు.

ఈ ప్రయత్నం కూడా అతడికి కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. ఫేస్‌బుక్‌లో అతడి ప్రకటన చూసిన పలువురు అమ్మాయిలు అతడికి మెసేజ్‌లు చేసినప్పటికీ డేటింగ్‌కు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు తన కోరిక నెరవేరుతుందని క్లేటన్ ఆశగా ఎదురుచూస్తున్నాడు.

ఇక, తన కుమారుడి ఫేస్‌బుక్ ప్రకటన చూసిన క్లేటన్ తండ్రి తొలుత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తేరుకుని అభినందించాడు. క్లేటన్ చాలా మంచోడని, ఏ పని అయినా చేస్తాడని, చివరికి వంట నుంచి అంట్లు తోమడం వరకు అన్నీ వచ్చని కొనియాడడం కొసమెరుపు.

More Telugu News