KTR: పట్టణ స్థానిక సంస్థలకు నిధుల విడుదల కోరుతూ నిర్మల సీతారామన్ కు కేటీఆర్ లేఖ

  • నిర్మల జోక్యం కోరిన కేటీఆర్
  • 15వ ఆర్థిక సంఘం కేటాయింపులపై కేంద్రమంత్రికి నివేదన
  • 14వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా సరిగా అందలేదన్న కేటీఆర్
Telangana minister KTR writes to FM Nirmala Sitharaman

తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధుల విడుదలలో ఆలస్యం అవుతోందని, అందుకు మీ జోక్యం అవసరం అంటూ తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు. మిలియన్ ప్లస్ నగరం అయిన హైదరాబాద్ కు రూ.468 కోట్లు, నాన్-మిలియన్ ప్లస్ నగరాలకు రూ.421 కోట్లను 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని వెల్లడించారు.

అయితే మిలియన్ ప్లస్ నగరాలకు నిధులు ఇంకా విడుదల కాలేదని, నాన్ మిలియన్ ప్లస్ నగరాలకు నిధుల విడుదలను కూడా నాలుగు దఫాలుగా విడుదల చేసేందుకు నిర్ణయించారని వివరించారు. ఈ క్రమంలో తొలి విడతగా మే 19న రూ.105.25 కోట్లు విడుదల చేశారని కేటీఆర్ తన లేఖలో తెలిపారు.

14వ ఆర్థిక సంఘం తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని తెలిపారు. నిర్మల సీతారామన్ దీనిపై చర్యలు తీసుకుని సకాలంలో నిధులు విడుదలయ్యేందుకు సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


More Telugu News