: బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెబుతున్నారు... వేలకు వేలు కాజేస్తున్నారు!

క‌డ‌ప జిల్లాలోని రాయచోటి పట్టణ పరిధి కృష్ణాపురానికి చెందిన జ్ఞానం ప్రసాద్ అనే ఓ వ్య‌క్తికి ఇటీవ‌ల ఓ కాల్ వ‌చ్చింది. తాము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని, మీ ఏటీఎం బ్లాక్‌ అయిందని ప్ర‌సాద్‌కి చెప్పారు. మ‌ళ్లీ ఆ కార్డు ప‌నిచేయాలంటే వెంట‌నే ఏటీఎం కార్డు పైన ఉన్న నంబర్ చెప్పాల‌ని కోరారు. నిజంగానే బ్యాంకు నుంచి కాల్ వ‌చ్చింద‌ని అనుకున్న ప్ర‌సాద్‌.. వారు అడిగి‌న‌ట్లుగానే ఆ నెంబ‌ర్ చెప్పేశాడు. అనంత‌రం ఏటీఎం కార్డుపై ఉండే సీవీవీ నెంబ‌రు కూడా అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మొబైల్‌కు మూడు మెసేజ్‌లు వస్తాయని త‌మ‌కు వాటిని చెప్పాల‌ని సూచించారు. ప్రసాద్ త‌న ఫోన్‌కి వ‌చ్చిన మూడు ఓటీపీ(వన్ టైమ్ పాస్ వ‌ర్డ్‌)ల‌ను చెప్పాడు.

అంతే, వరుసగా అత‌డి ఖాతా నుంచి రూ.19,999లు, రూ.15,000లు, రూ.2 వేలు మాయ‌మైపోయాయి. మొత్తం రూ.37వేలు అతని ఖాతాల నుంచి కేటుగాళ్లు కొట్టేశారు. అనంత‌రం ప్ర‌సాద్ అస‌లు విష‌యం తెలుసుకుని లబోదిబో మంటూ వెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక్క ప్ర‌సాదే కాదు, దేశంలో ఇటువంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రుగుతున్నాయి. ఏపీకి చెందిన చిన్నమండెం మండలం చాకిబండ కస్పాకు చెందిన చిలకల సలాం అనే వ్యక్తి కూడా ఇలాగే మోస‌పోయి రూ.47 వేలను పోగొట్టుకున్నాడు. ఇటువంటి ఫిర్యాదులు ప్రతి రోజూ అనేకం వస్తున్నాయని రాయచోటి అర్బన్‌ సీఐ డి.మ‌హేశ్వ‌ర‌రెడ్డి ఈ రోజు మీడియాకు తెలిపారు.

బ్యాంకు ఖాతాల వివరాలు, ఏటీఎం వివరాలు ఎవ్వ‌రికీ ఇవ్వ‌కూడ‌ద‌ని, పాస్ వ‌ర్డ్‌ల గురించి బ్యాంకు వారు అడ‌గ‌బోర‌ని, ఇటువంటి ప‌నులు కేటుగాళ్లు మాత్ర‌మే చేస్తార‌ని వివ‌రించారు. దేశంలో ఇటువంటి నేరాలు అధిక‌మై పోతున్నాయి. కేటుగాళ్లు ప్ర‌తిరోజు ఇదే ప‌ని మీద ఉంటున్నారు. ఒక్క రోజులో వంద‌ల మందికి ఫోన్లు చేస్తున్నారు. తాము ఫోను చేసిన వారిలో ఎవ‌రో ఒక‌రు త‌మ మాట‌లు న‌మ్మ‌పోతారా? అని భావిస్తూ రెచ్చిపోతున్నారు. అమాయ‌కుల బ్యాంకు అకౌంట్ల నుంచి డ‌బ్బులు స్వాహా చేసేస్తున్నారు.

More Telugu News