: ప్రియమైన మోదీజీ! మా కుటుంబానికి న్యాయం చేయండి..: ప్రధాని లేఖ రాసిన 11 ఏళ్ల బాలిక!

భూ వివాదం కారణంగా గ్రామ పెద్దలు తమ కుటుంబాన్ని తమ ఇంటి నుంచి గెంటివేయడంతో కలత చెందిన 11 ఏళ్ల ఒడిశా బాలిక ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని అందులో అర్థించింది. కటక్ జిల్లాలోని పోఖరి గ్రామానికి చెందిన ఉగ్రసేన్ మొహరానా కుమార్తె శుభశ్రీ ప్రధానికి లేఖ రాస్తూ.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరింది. ఏ తప్పు చేయకుండానే తమను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు సాయం చేయాలని లేఖలో కోరింది. గ్రామస్థులు తన తండ్రిపై దాడి చేయడమే కాకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ భూమిని అన్యాయంగా లాక్కునేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే తమపై కక్ష కట్టారని  వివరించింది.

కాగా, గ్రామ పెద్దల తీర్పుపై ఉగ్రసేన్ కుటుంబం నియాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారని బాలిక లేఖలో పేర్కొంది. తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబం డీజీపీ కేబీ సింగ్, ఇతర ఉన్నతాధికారులను కలిసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రధానికి లేఖ రాయాలని బాలిక నిర్ణయించుకుంది. తమ భూమిని ఆక్రమించుకున్న కబ్జాదారులు అందులో ఇల్లు కడుతున్నారని, తమను ఇంటి నుంచి గెంటివేశారని, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

More Telugu News