: మీరేమ‌న్న స్వ‌ర్గంలోంచి ఊడిప‌డ్డారా?: కాంగ్రెస్ నేత‌ల‌పై కేసీఆర్ చుర‌క‌లు

ఉద్య‌మ సందర్భంలో తాను ఏ విష‌యాలు చెప్పానో ఆ ఫ‌లితాలే ఇప్పుడు వ‌స్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో టీడీపీ మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్ త‌మ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ప్ర‌సంగిస్తూ... తాము తెలంగాణ‌లో ఇప్పుడు ఎన్నో ఎక‌రాల‌కు నీరందిస్తున్నామ‌ని తెలిపారు. అదే స‌మైక్యాంధ్ర అలాగే ఉంటే క‌ల‌లో కూడా ఇటువంటి ప‌నులు జ‌రిగేవికావని అన్నారు. 'మేం చేసిన స‌ర్వే అంతా భోగ‌స్ అంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు అంటున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా ఈ మధ్య స‌ర్వే చేసి న‌రేంద్ర మోదీకి ప్ర‌జాదర‌ణ మ‌రింత పెరిగింద‌ని, బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పింది. మరి అది కూడా భోగ‌సేనా?' అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. 'మీరు చేస్తే రైటు, మేము చేస్తే భోగ‌స్ స‌ర్వేనా?' అని అడిగారు. బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు వాస్త‌వాల‌ను జీర్ణించుకునే ప‌రిస్థితుల్లో లేరని అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమదే అధికారం అని, అభివృద్ధి చేస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు ఎన్నో మాట‌లు మాట్లాడుతున్నార‌ని కేసీఆర్ అన్నారు. మీరేమ‌న్న స్వ‌ర్గంలోంచి ఊడిప‌డ్డారా? అని కాంగ్రెస్ నేత‌ల‌ను కేసీఆర్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ గ‌తంలో అధికారంలో ఉంటే ఎటువంటి ప‌నులు చేసిందో మాకు తెలియ‌దా? అని అడిగారు. కాంగ్రెస్ నేత‌ల‌ అవినీతి, అక్ర‌మాలు ఏ పాటివో తెలియ‌దా? అని అన్నారు. ఇదే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేత‌లు 30 ఏళ్లు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఏడిపించారని అన్నారు. అటువంటి వారికి తెలంగాణ ప్ర‌జ‌లు ఎలా ఓట్లేస్తార‌ని కేసీఆర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ ప‌నితీరు ఎలా ఉందో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారని చెప్పారు. త‌మ పాల‌న‌లో క‌రెంటు క‌ష్టాలు తీరిపోయాయని చెప్పారు.    

More Telugu News