: సైనికుల తలల నరికివేతపై పాక్ కు సీరియస్ వార్నింగ్... దిమ్మతిరిగే జవాబిస్తామంటున్న సైన్యం

జమ్మూ కాశ్మీర్ లో వాస్తవాధీన రేఖ వెంబడి, పాకిస్థాన్ తన పైశాచికత్వాన్ని చూపుతూ ఇద్దరు భారత సైనికుల తలలను నరికివేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ అటాక్ తరువాత పాక్ పై ఎలా స్పందించాలన్న విషయమై ప్రభుత్వం తర్జనభర్జనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, పాకిస్థాన్ దుర్మార్గంపై చూస్తూ ఊరుకోబోయేది లేదని సైన్యంలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ దేశానికి దిమ్మతిరిగే సమాధానాన్ని ఇస్తామని స్పష్టం చేశారు. అది ఎప్పుడు, ఎక్కడ? అన్నది ఎల్ఓసీ వెంబడి విధుల్లో ఉన్న సైన్యానికే వదిలివేసినట్టు వెల్లడించారు.

గత వారంలో కుప్వారాలోని సైనిక క్యాంపుపై ఆత్మాహుతి దాడి, సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడితో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల దుర్మరణం ఘటనలను మరచిపోకముందే పాక్ దుర్మార్గం ప్రపంచానికి తెలియడంతో, నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ, అంతర్గత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఎల్ఓసీ వెంబడి సోమవారం సైతం భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. పాక్ వైపు నుంచి తేలికపాటి మోర్టార్లతో గంటల పాటు కాల్పులు జరుగగా, భారత జవాన్లు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు.

More Telugu News