: సినీ పరిశ్రమలో నేను నేర్చుకున్న పాఠాలివే!: సోనాక్షి సిన్హా

స్టార్ హీరో వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి సూపర్ హిట్లతో వంద కోట్ల హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న సోనాక్షి సిన్హా ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేక సతమతమవుతోంది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో తాను నేర్చుకున్న పాఠాల గురించి వివరిస్తోంది. సినీ పరిశ్రమలో ఉన్నవారిని అనుక్షణం ఎవరో ఒకరు నిశితంగా గమనిస్తుంటారని తెలిపింది. అలా చూడడమే కాకుండా ప్రధానంగా తప్పులు వెతుకుతారని తెలిపింది. అలాగే ప్రతిక్షణం పొగిడేవారు కూడా ఉంటారని తెలిపింది. అయితే సినీ పరిశ్రమలో ఉన్నవారెవరైనా ఈ రెండు రకాల మనుషులను పట్టించుకోకపోవడమే ఉత్తమమని అభిప్రాయపడింది. అలాగే సినీ నటులు వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరు అంశాలుగా గుర్తించాలని తెలిపింది. అంతే కాకుండా ఈ రెండింటిని ఒక దానితో మరొకటి మిళితం చేయకూడదని సూచించింది.

అలాంటి సమతౌల్యం పాటిస్తే ఇబ్బందులు ఉండవని, అలాకాకుండా వ్యక్తిగత జీవితంతో వృత్తిని కలిపితే ఇబ్బందులు తప్పవని తెలిపింది. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే....ఎప్పుడూ స్టార్‌ డమ్‌ నెత్తికెక్కకూడదని సూచించింది. తన వరకు తాను స్టార్‌ కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని చెప్పింది. అలా కాకుండా స్టార్ డమ్ మనకు నెత్తికెక్కినా, మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టినా మన పతనం ప్రారంభమయిందని అర్థం చేసుకోవాలని సూచించింది. అంతే కాకుండా ప్రధానంగా ప్రతి విషయానికి ప్లాన్‌ బీ ఉండాలని హెచ్చరించింది. లేకపోతే చాలా సందర్భాల్లో తీవ్ర నిరాశకు గురవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ పాఠాలన్నీ తన సినీ ప్రయాణంలో నేర్చుకున్నానని సోనాక్షి తెలిపింది. 

More Telugu News