: నోట్ల రద్దుపై ప్రధాని హామీని ఎందుకు అమలు చేయడం లేదంటే.. ఆర్బీఐ వివరణ!

ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చినా మార్చి 31 వరకు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఎందుకు అనుమతించడం లేదని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వింతైన సమాధానం ఇచ్చింది. ఆ ప్రశ్న ‘సమాచారం’ నిర్వచనం కిందకు రాదని పేర్కొంటూ సమాధానం చెప్పేందుకు నిరాకరించింది. గతేడాది నవంబరు 8న ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన తర్వాత పాత నోట్లను 31 మార్చి, 2017 వరకు మార్చుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు.

అయితే ఆ తర్వాత ఎన్నారైలు, ఆ యాభై రోజులు విదేశాల్లో ఉన్నవారు, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే జవాన్లకు మాత్రమే ఈ గడువు వర్తిస్తుందంటూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రధాని హామీని అమలు చేయకపోవడంపై వచ్చిన పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ (ఏజీ) మాట్లాడుతూ ప్రధాని హామీ కంటే చట్టానికే విలువ ఎక్కువని పేర్కొన్నారు. మార్చి 31 నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశానికి ఆర్బీఐ బదులిస్తూ వాటిని బయటపెడితే దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని పేర్కొంది.

More Telugu News