: ఇండియాలో మరో స్వాతంత్ర్య ఉద్యమం రావాలి: నరేంద్ర మోదీ

అభివృద్ధి పథంలో దూసుకెళ్లే దిశగా, ఇండియాలో మరో స్వాతంత్ర్య ఉద్యమం రావాల్సి వుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే సదస్సులో వీడియో ద్వారా ప్రసంగించిన ఆయన, భారత యువతలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి మరోసారి రగలాల్సి వుందని, కొత్త భారతావనిని సృష్టించుకోవడం కోసం కంటున్న కలలను యువతే తీర్చాలని పిలుపునిచ్చారు. అవకాశాలను అందరికీ దగ్గర చేయడం, ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం తప్పనిసరని అన్నారు.

ఎన్నో దశాబ్దాలుగా తప్పుడు ప్రభుత్వ విధానాల కారణంగా, సరైన మార్గంలో ఇండియా నడవలేకపోయిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఐదేళ్లకు ఓసారి జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారని, ఇక ఆ పరిస్థితి మారిపోవాల్సి వుందని అన్నారు. దూరదృష్టితో తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇండియాలో నెలకొన్న చెడును తొలగించాలని యువత ఉవ్విళ్లూరుతోందని, తాము వారికి సహకరించి, భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తామని మోదీ వెల్లడించారు. నిర్దేశిత సమయంలోగా లక్ష్యాలను చేరుకునేలా పలు నిర్ణయాలు తీసుకున్నామని, పౌరులకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని రూపొందిస్తున్నామని, అందులో భాగంగానే జీఎస్టీని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

More Telugu News