: పన్నీర్ వర్గంలో పెరుగుతున్న ఎమ్మెల్యేలు... నేడు ఢిల్లీకి!

తమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించిన వేళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, దివంగత జయలలితకు నమ్మినబంటుగా ఉన్న పన్నీర్ సెల్వం తన వర్గం ఎమ్మెల్యేల మద్దతు పత్రాలతో నేడు ఢిల్లీకి పయనం కానున్నట్టు తెలుస్తోంది. తన తిరుగుబాటు విఫలం కాకూడదన్న ఉద్దేశంతో ఆయన చకచకా పావులు కదుపుతున్న వేళ, పన్నీర్ వర్గంలోకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్యా పెరిగింది. తొలుత ఆయనకు మద్దతు పలికే ఎమ్మెల్యేల సంఖ్య 50గా ఉండగా, గంటల వ్యవధిలో మరో పన్నెండు మంది వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఇక 235 స్థానాలున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే, 118 మంది సభ్యుల బలం కావాలి. ఆయన వెంట ఇప్పుడు 62 మంది ఉండగా, మరో 56 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి.

శశికళ ముఖ్యమంత్రి కాకుండా చూసేందుకు ఎంతదూరమైనా వెళతానని డీఎంకే నేత స్టాలిన్ చెప్పిన మాటలు చూస్తే, ఆ పార్టీకి చెందిన 89 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికే అవకాశాలను తోసిపుచ్చలేమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఆపై సభలో కాంగ్రెస్ పార్టీకి 8 మంది, ఐఎంఎల్ కు ఒక సభ్యుడు ఉన్నారు. అన్నాడీఎంకేలో మిగిలిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు శశికళ ఏరికోరి టికెట్లు ఇప్పించుకున్న వారు కావడం, ఆమె అడుగులకు మడుగులు ఒత్తేవారు కావడంతో వారి మద్దతు లభించే అవకాశాలు తక్కువే. అన్నాడీఎంకే చీలిక వర్గానికి మద్దతు పలకడం ద్వారా ప్రభుత్వంలో స్థానం పొంది, వచ్చే ఎన్నికల నాటికి బలపడవచ్చని స్టాలిన్ భావిస్తే మాత్రం అది పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని నిలుపుతుంది.

More Telugu News