: తప్పు చేస్తే రాష్ట్రానికి సీఎస్ అయినా, ఇంకెవరైనా ఒకటే: కేంద్ర మంత్రి అర్జున్ రామ్

తప్పు చేసిన వ్యక్తి ఓ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అయినా, ముఖ్యమంత్రి అయినా, మరెవరైనా తమకు ఒకటేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు తీవ్ర విమర్శలు చేసిన అనంతరం, న్యూఢిల్లీలో అర్జున్ రామ్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, సామాన్యుడు తప్పు చేస్తే ఎలా చూస్తూ ఊరుకోబోమో, ఉన్నతాధికారి తప్పు చేసినా అలాగే ఉంటుందని చెప్పారు. నేరం చేసిన వారెవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. చీఫ్ సెక్రటరీ అయినంత మాత్రాన ప్రజా ధనాన్ని లూటీ చేసేందుకు హక్కు లభించినట్లు కాదని, రాజ్యాంగం ప్రకారం ప్రజలంతా ఒకటేనని అన్నారు. తానూ చట్టం ముందు సామాన్యుడినేనన్న విధంగా ఆయన ఆలోచించుకోవాలని హితవు పలికారు.

More Telugu News