: వివాదం రేపిన జయలలిత వేలిముద్ర.. తమిళనాట విపక్షాలు గరంగరం

అస్వస్థత కారణంగా సెప్టెంబరు 22న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఆహారాన్ని స్వయంగా తీసుకుంటున్నారని, త్వరలో ఆమె డిశ్చార్జి అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగానే తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంల ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపాల్సి వచ్చింది. అయితే అభ్యర్థులకు ఇచ్చిన బీఫాంలలో జయలలిత సంతకానికి బదులు ఆమె వేలి ముద్ర ఉండడం ఇప్పుడు తమిళనాడులో తీవ్ర వివాదాస్పదమైంది. 1989 నుంచి జయలలిత సంతకంతోనే అభ్యర్థులకు బీఫాంలు జారీ చేస్తున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల కోసం అక్టోబరు 28న అన్నాడీఎంకే అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారు అందించిన బీఫాంలలో పార్టీ అధినేత్రి జయలలిత సంతకం ఉండాల్సిన చోట వేలిముద్ర ఉంది. సీఎం పూర్తిగా కోలుకున్నారని, త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని, ఆమె స్వయంగా తన చేతులతో ఆహారాన్ని తీసుకుంటున్నారని చెబుతున్న నేతలు ఆమె వేలిముద్ర ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. వేలిముద్ర వేసింది నిజంగా జయలలితేనా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. బీఫాంలలో వేలిముద్ర చెల్లుతుందా? అని ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత కుడి చేతిగుండా మందులు ఎక్కిస్తుండడంతో ఆమె ఎడమ చేతి బొటనవేలితో ముద్ర వేయాల్సి వచ్చిందని వేలిముద్రకు సాక్షి సంతకం చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ బాలాజీ వివరణ ఇచ్చారు. వేలిముద్ర విషయమై ఈసీ కూడా వివరణ ఇచ్చింది. అన్నాడీఎంకే తరపున పోటీచేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు అందజేసే ఏ,బీ ఫాంలలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత వేలి ముద్రలు వినియోగిస్తున్నట్టు గతనెల 26న పార్టీ కార్యాలయం నుంచి తమకు లేఖ అందిందని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ వైద్యుడి సమక్షంలో జయలలిత వేసిన వేలిముద్ర చెల్లుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

More Telugu News