: ఇప్పటికే రూ. 25 కోట్ల ఖర్చు... ఆక్వా పార్క్ ను తరలించలేం, ప్రజలకు సర్దిచెప్పండి: ప్రజాప్రతినిధులతో చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను మరో ప్రాంతానికి తరలించే అవకాశాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఉదయం భీమవరం ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమైన ఆయన, ప్రజల ఆందోళన ఏంటో అడిగి తెలుసుకున్నారు. స్థానికులు చేస్తున్న అభ్యంతరాలపై ఆరా తీసిన ఆయన, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పార్కు నిర్మాణం చేపట్టాలని సూచించారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం, ఆ వివరాలను మీడియాకు వెల్లడించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, ఇప్పటికే రూ. 25 కోట్లను ఫుడ్ పార్క్ కోసం ఖర్చు పెట్టామని చంద్రబాబు గుర్తు చేసినట్టు చెప్పారు. ఈ పరిస్థితుల్లో మరో ప్రాంతానికి దాన్ని తరలించలేమని అన్నారు. కేవలం నీరు కలుషితం అవుతుందన్నదే ప్రజల భయమని, పైప్ లైన్ల ద్వారా ఆ వ్యర్థాలను సముద్రంలోకి వదిలేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ విషయమై ప్రజల అనుమానాలను తొలగించి, వారికి సర్దిచెప్పాలని చంద్రబాబు ఆదేశించినట్టు వెల్లడించారు.

More Telugu News