: పాక్ తో చిరకాల స్నేహం...మా బంధం బలమైనది: చైనా

పాకిస్థాన్‌ తనకు చిరకాల నేస్తమని, పాక్‌ తో తమ స్నేహం ఎన్నటికీ విడదీయలేనిదని చైనా స్పష్టం చేసింది. యూరీ సెక్టార్ పై జరిగిన దాడి నేపథ్యంలో భారత్ ఆగ్రహానికి గురైన వేళ, ప్రపంచం మొత్తం భారత్ పై సానుభూతి వ్యక్తం చేస్తున్న సమయంలో, చైనా మాత్రం పాక్ పాటే పాడడం విశేషం. చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా వెల్లడించిన ప్రకారం...ఐరాస సమావేశం నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ తో సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వాములైన ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, స్నేహం కొనసాగుతుందని, తమ స్నేహం విడదీయలేనిదని లీ కెకియాంగ్ తెలిపారు. పాకిస్థాన్‌ కు ఆచరణాత్మక సాయం చేయడానికి చైనా సిద్ధంగా ఉంటుందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇదే సమయంలో కశ్మీర్‌ అంశం కానీ, యూరీ ఘటనపై కానీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. ఇదే కథనాన్ని పాక్ లోని డాన్ పత్రిక పూర్తి విభిన్నంగా ప్రచురించింది. కశ్మీర్ అంశంపై పాక్ కు చైనా మద్దతు ప్రకటించిందని, కశ్మీర్ అంశంలో ఎలాంటి సాయానికైనా చైనా సిద్ధంగా ఉందని తెలిపినట్టు కథనం ప్రచురించింది. ఉగ్రవాదానికి పాక్ బలిపశువు అవుతోందని లీ కెకియాంగ్ చెప్పినట్టు కథనం ప్రచురించింది.

More Telugu News