: లాభనష్టాల మధ్య ఊగిసలాటలో బుల్స్ పైచేయి!

సెషన్ ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టం, ఉదయం 11 గంటల సమయంలో లాభాల్లోకి, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నష్టాలు, ఆపై బుల్స్ మద్దతుతో ముందుకు దూకిన సూచికలు... ఇది స్థూలంగా సోమవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్లో కనిపించిన ఒడిదుడుకులు. ఇటీవలి కాలంలో నష్టాల మధ్య సాగుతూ వచ్చిన సూచికలు ఈ సెషన్లో లాభాల బాట నడిచాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 105.92 పాయింట్లు పెరిగి 0.42 శాతం లాభంతో 25,150.35 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 39.60 పాయింట్లు పెరిగి 0.52 శాతం లాభంతో 7,650.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.66 శాతం, స్మాల్ క్యాప్ 0.40 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 9 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. అదానీ పోర్ట్స్, హిందాల్కో, కోల్ ఇండియా, జడ్ఈఈఎల్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర కంపెనీలు నష్టపోయాయి. శుక్రవారం నాడు రూ. 95,37,611 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, సోమవారం నాడు రూ. 95,87,764 కోట్లకు పెరిగింది. మొత్తం 2,852 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,491 కంపెనీలు లాభాలను, 1,147 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News