ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమయాన్ని వృథా చేస్తే అంతే సంగతులు!

Thu, Jun 25, 2015, 01:26 PM
ఒక రోజులో ఎంత పనిచేశామన్న విషయాన్ని కాకుండా ఏం పని చేశామని, అది ఏ మేరకు ఉపయుక్తకరమని ప్రశ్నించుకుని ముందుకు సాగితే, లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. మనకు రోజులో ఉండేది 24 గంటలు. ఈ సమయం సరిపోయిందని ఎప్పుడూ అనిపించదు. ఉన్న సమయాన్ని వృథా చేసే వారెందరో. చేతిలో ముఖ్యమైన పని వున్నప్పుడు కాలంతో పాటు పరిగెత్తి దాన్ని పూర్తి చెయ్యాలే తప్ప ఊరికే కూర్చోరాదు. మన పక్కనే సమయాన్ని వేస్ట్ చేసే వారు ఎందరో కనిపిస్తుంటారు. వారిని ఎంత మరచిపోతే అంత మంచిది. సమయాన్ని వృథా చేయకుండా ముందుకు సాగాలంటే...

పూర్తి చేయాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ విషయం వరకూ అందరూ ముందుంటారు. కానీ, దాన్ని సమర్థవంతంగా పూర్తి చెయ్యడంలో ఎందరో వెనుకబడతారు. ముఖ్యమైనవి, అవసరాలు పూర్తి చేసే వాటిని ముందుగా చక్కబెట్టుకోవాలి. ఇతరుల సహకారం అవసరమనిపిస్తే, వారికన్నా ముందే 'నేను సిద్ధంగా వున్నా... మీదే ఆలస్యం' అని తెలిపేలా వుండాలి. ట్రాఫిక్ జాంలలో ఇరుక్కొని టైం వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఏదైనా తలపెట్టిన వర్క్ పూర్తవుతున్న సమయంలో చివరి నిమిషాలు అత్యంత కీలకం. చివరి దశలో సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంటే చేస్తున్న పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. సమయం తరుముకొస్తోందని హడావుడి పడితే, ఎక్కడో ఒకచోట తప్పు జరుగుతుంది.

ఇక సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే ముందు, అంటే ఫోన్ కాల్స్ లో మాట్లాడేటప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారన్న విషయాన్ని క్లుప్తంగా, స్పష్టంగా చెప్పి ముగించడం వల్ల ఎన్నో నిమిషాలు ఆదా అవుతుంది. ఇ-మెయిల్స్ చూసుకోవడానికి, కాల్స్ అందుకోవడానికి నిర్దేశిత సమయాన్నే వాడుకుంటే మంచిది. ఎవరైతే మీకు కాల్ చేస్తే మేలు కలుగుతుందని భావిస్తారో, వారికి మాత్రమే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల అసందర్భ కాల్స్ తగ్గుతాయి. ఆఫీసులో పనిచేసే కొలీగ్స్, మిత్రులతో అనవసర సమావేశాలు పెట్టుకోవడం వల్ల ఎంతో సమయం వృథా అవుతోందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి. ఈ తరహా మీటింగులను వదిలేస్తే మంచిది. ఒకవేళ నలుగురితో చర్చించాల్సిన విషయం అయితే, డైరెక్టుగా విషయం చెప్పి, చర్చించి సమావేశాన్ని అంతటితో ముగించాలి.

సమయాన్ని మింగేసే మరో ప్రమాదకారి 'ఇడియట్ బాక్స్' (టెలివిజన్). ఇష్టమైన కార్యక్రమాన్ని టీవీలో చూస్తుంటే సమయమే తెలీదని అందరూ అంగీకరిస్తారు. మనం కోల్పోయే ఆ సమయమే లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో అడ్డంకి అవుతుంది. ఒకవేళ మిస్ కాకూడని కార్యక్రమమే టీవీలో వస్తుంటే, దాన్ని రికార్డు చేసుకుని తదుపరి పనిలేని సమయంలో చూసుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే ఇంటర్నెట్ కు కూడా అతిగా అలవాటు పడకూడదు. దీని వల్ల కూడా ఎంతో సమయం ఆదా అవుతుంది. ఇంటర్నెట్ ను మనకు ఉపయోగపడేలా వాడుకోవాలే తప్ప, దానికి బానిసై కాలాన్ని గడిపేయరాదు.

ఇక చివరిగా మనం చెయ్యలేని పని ముందుకు వస్తే మొహమాటానికి పోకుండా 'నో' చెప్పేయడం నేర్చుకోవాలి. ఈ విషయంలో ఎంత నిజాయతీగా ఉంటే మీకంత మేలు కలుగుతుంది. సమయాన్ని తినేసే చేతగాని పెద్ద పని నెత్తికి ఎత్తుకోవడం కంటే, వల్లయ్యే పనిని తీసుకుని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.146.5.196
Articles (Latest)
Articles (Education)