భోజనం చేస్తున్నవారిపై ఆవేశపడకూడదా ?

భోజనం చేస్తూ పక్కనే వున్న వారితో మాట్లాడుతూ వుంటే, అలా భోజనం చేస్తూ మాట్లాడకూడదని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తోన్న పిల్లలను మందలించడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తే, అమ్మమ్మ ... తాతయ్య వంటి వాళ్లు ఆ సమయంలో తిట్టకూడదని అడ్డుపడుతుంటారు. ఇలా భోజనం చేసే వారిపై ఆవేశపడకూడదు అనడానికి అనేక కారణాలు కనిపిస్తూ వుంటాయి.

భోజనం అనేది పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా చేసినప్పుడే వంటబడుతుంది. అందుకే హడావిడిపడకుండా ... మాట్లాడకుండా భోజనం చేయాలని చెబుతుంటారు. నిజానికి ఆనందానికి ... ఆకలికి మధ్య ఎంతో దగ్గర సంబంధం వుంది. మనసు సంతోషంగా వుంటే ఆకలి వుంటుంది, బాధగా ... చిరాకుగా వుంటే ఆకలికాదు.

పిల్లలైనా ... యువకులైనా తెలిసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే, వాళ్లు భోజనం చేసే సమయంలో తల్లిదండ్రులు మందలించడం జరుగుతుంటుంది. ఆ మాటలను భరిస్తూనే బాధపడుతూనే వాళ్లు భోజనం చేస్తారు. ఇలా ఆవేదనని అణచుకుంటూ చేసిన భోజనం వంటబట్టకపోగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెస్తుందని అంటారు. ఇక భోజనం చేస్తూనే పిల్లలు ఎదురు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే 'పొలమారి' ప్రాణాపాయం సంభవించే పరిస్థితి ఏర్పడుతూ వుంటుంది.

కొంతమంది ఆవేశాన్ని అణచుకోలేక అన్నం కంచాన్ని విసిరికొడుతూ వుంటారు. జీవితంలో ఎవరైతే దేనినైతే నిర్లక్ష్యం చేస్తారో ... కోపంతో విసిరి కొడతారో అది వాళ్లకి దూరమవుతుందనేది ఎంతోమంది విషయంలో నిరూపించబడింది. ఇక పిల్లలు కోపంతో భోజనం చేయకుండా వెళ్లిపోతే ... ఏ తల్లిదండ్రులు కూడా కంచాల ముందు కూర్చోలేరు. ఫలితంగా వండుకున్న పదార్థాలన్నీ కూడా వృథా అవుతుంటాయి.

ఎలాంటి పర్వదినం కాకుండా అలా అందరూ కోపంతో కటిక ఉపవాసం చేయడం కూడా దోషమేనని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్న వారిపై ఆవేశపడటం వలన శాస్త్ర సంబంధమైన దోషాలతో పాటు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ వుంటాయి. అందువలన భోజన సమయంలో సాధ్యమైనంత వరకూ కోపతాపాలకు పోకుండా వుండటమే అన్నివిధాలా మంచిదని చెప్పవచ్చు.


More Bhakti News