ఇక్కడ దేవుడి పాదరక్షలు అరిగిపోతాయట !

భగవంతుడి పాదాలకు నమస్కరించడం వలన, ఆయన పాదుకలను పూజించడం వలన సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. భరతుడు ... శ్రీరాముడి పాదుకలను తీసుకువెళ్లి వాటిని సింహాసనంపై వుంచి పరిపాలన కొనసాగించాడంటే, పాదుకల యొక్క విశిష్టత ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని క్షేత్రాల్లో ప్రధాన దైవాల పాదరక్షలను దర్శనార్థం వుంచుతుంటారు.

తిరుమలలో స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేయించిన పాదరక్షలు వుంటాయి. వాటిని ధరించే స్వామివారు అలమేలు మంగమ్మ సన్నిధికి వెళతాడని చెబుతుంటారు. అలాగే కర్ణాటక - పంచముఖి క్షేత్రంలో కూడా ప్రత్యేక మందిరంలో ఉంచబడిన హనుమంతుడి పాదరక్షలను భక్తులు దర్శించుకుంటూ వుంటారు. హనుమంతుడు ఒక భక్తుడికి కలలో కనిపించి తనకి పాదరక్షలను సమర్పించవలసిందిగా కోరాడట. అప్పటి నుంచి ఆయన ... ఆ తరువాత ఆయన వంశీకులు స్వామివారికి ప్రత్యేకంగా పాదరక్షలను తయారుచేసి సమర్పిస్తూ వస్తున్నారు.

ఈ పాదరక్షలు చాలా పెద్దవిగా .. చక్కని అలంకరణతో మందంగా .. మెత్తగా వుంటాయి. ప్రతి రోజు రాత్రి వేళలో స్వామి ఈ పాదరక్షలను ధరించి, తమ గ్రామంలో తిరుగుతూ ఉంటాడని స్థానికులు విశ్వసిస్తూ వుంటారు. దుష్టశక్తుల బారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుతూ, పాడిపంటలను సంరక్షిస్తూ ఉంటాడని అంటారు.

స్వామివారు తమ గ్రామాన్ని పర్యవేక్షించడం నిజమేననీ, ఆయన పాదుకలు అరిగిపోతూ ఉండటమే అందుకు నిదర్శనమని చెబుతుంటారు. ఇలా పాదుకలు అరిగిపోయినప్పుడల్లా తిరిగి కొత్తవి తయారుచేసి ఇస్తూ వుంటారు. హనుమంతుడు ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై వున్నాడనే విషయాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది కనుక, ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు భావిస్తుంటారు.


More Bhakti News