సమస్త దోషాలను తొలగించే సూర్య స్తోత్రం

భారతీయుల ఆధ్యాత్మిక జీవనవిధానంలో సూర్యుడికి విశిష్టమైన స్థానం వుంది. సూర్యుడినే దేవుడిగా భావించి పూజించిన అనేక నాగరికతలు మనకి ప్రాచీనకాలంలో కనిపిస్తాయి. సమస్త లోకాలకు వెలుగును ప్రాసాదించే సూర్యుడికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించిన తరువాతనే, రుషులు తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభించేవాళ్లు.

ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించడమనేది నేటికీ ఎంతోమంది పాటిస్తూ వస్తున్నారు. ఉదయాన్నే సూర్యుడి నుంచి వెలువడే లేలేత కిరణాలు, అనారోగ్యానికి కారణమయ్యే అనేక కణాలను నిర్వీర్యం చేస్తాయి. శరీరానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తూ, ఆరోగ్యవంతంగా ఉంచుతుంటాయి. సూర్య నమస్కారం ఆరోగ్యమే కాకుండా, అనుకోకుండా సంక్రమించే అనేక దోషాల నుంచి విముక్తిని కలిగిస్తుంటుంది.

నవగ్రహాలలో నాయకుడిగా కనిపించడమే కాకుండా, మిగతా గ్రహాలను ప్రభావితం చేయడంలోనూ సూర్యుడు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాడు. ఈ కారణంగానే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించాలనీ, ఆయన నామాన్ని స్మరించాలనీ ... ఆయన క్షేత్రాలను దర్శించాలని పెద్దలు చెబుతుంటారు. ఇక నిత్యపూజా విధానంలో భాగంగా సూర్యుడి స్తోత్రం చదవడం వలన కూడా సకల దోషాల నుంచి బయట పడవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వివిధ కారణాల వలన సంక్రమించే దోషాలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూ ఉంటాయి. జీవితం పట్ల ఆశను ... ఆసక్తిని లేకుండా చేస్తూ, నిరాశా నిస్పృహలను కలిగిస్తుంటాయి.

అలాంటి దోషాల బారి నుంచి బయటపడవలసిన వాళ్లు సూర్యుడి స్తోత్రాన్ని తప్పక పఠించవలసి ఉంటుంది. '' సూర్యం సుందరలోక నాథామృతం వేదాంత సారం శివం ! జ్ఞాన బ్రహ్మమయం సురేశ మమలం లోకైక చిత్త స్వయం !! ఇంద్రాదిత్య నరాధిపం సురగురుం త్రైలోక్య చూడామణిం ! బ్రహ్మ విష్ణు శివ స్వరూప హృదయం వందే సదా భాస్కరం !! అనే ఈ స్తోత్రాన్ని అనునిత్యం చదువుతూ సూర్యుడిని పూజించడం వలన జన్మజన్మలుగా వెంటాడుతూ వస్తోన్న వివిధ దోషాల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆశించిన శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News