పేదవాడి చెంతకి పెద్దదేవుడు

దత్తాత్రేయుడు సెలవిచ్చిన 'అనఘావ్రతం' చేసుకోవడం వలన కార్తవీర్యార్జునుడు మహాపరాక్రమవంతుడవుతాడు. సింహాసనాన్ని అధిష్టించగానే .. తన రాజ్యంలోని వారంతా విధిగా అనఘావ్రతాన్ని ఆచరించాలని ప్రకటిస్తాడు. దాంతో అందరూ ఆ ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమవుతారు. అదే సమయంలో ఓ మురికి వాడలో నివసించే దంపతులు కూడా ఈ వ్రతాన్ని అచరించాలని అనుకుంటారు.

కానీ అక్కడికి రావడానికి పురోహితులు అంగీకరించకపోవడంతో ఆ దంపతులు దిగాలు పడిపోతారు. దాంతో ఇక తమకి అనఘా వ్రతం చేసుకోవడం వీలుపడదనీ, తమకి ఇక మంచి రోజులు రావని బాధపడుతూ వుంటారు. ఆ దంపతుల ఆవేదన దత్తాత్రేయస్వామి చెవిన పడుతుంది. ఆయన పురోహితుడి వేషంలో వాళ్ల ఇంటికి చేరుకుంటాడు. తమని వెతుక్కుంటూ వచ్చిన పురోహితుడిని చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోతారు.

అనఘా వ్రతం చేయిస్తానని ఆయన చెప్పడంతో, సంతోషంగా అందుకు ఏర్పాట్లు చేస్తారు. నైవేద్యంగా ఆవుపాలను తీసుకురమ్మని స్వామి చెప్పడంతో ఆ దంపతులు తెల్లమొహం వేస్తారు. తమ ఇంట్లో వట్టిపోయిన ఆవుమత్రమే ఉందనీ, అది పాలు ఇవ్వక చాలాకాలమైపోయిందని చెబుతారు. పాలు పితకడానికి ప్రయత్నించమని ఆయన చెప్పడంతో అలాగే చేస్తారు. కడవలకొద్దీ పాలను ఆవు ఇస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోతారు.

పురోహితుడుగా వచ్చింది సామాన్యమైన వ్యక్తికాదనే విషయం వాళ్లకి అర్థమైపోతుంది. దాంతో వాళ్లు ఆ నైవేద్యాలను స్వామి పాదాల చెంత నుంచి, తమవంటి పేదవారి ఇంటికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలపై పడతారు. తన నిజరూపాన్ని గ్రహించిన ఆ దంపతులకు దత్తాత్రేయస్వామి దర్శనమిచ్చి, అనఘా వ్రత ఫలితాన్ని అనుగ్రహించి వెళతాడు.


More Bhakti News