రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ టాప్.. అత్యంత ధనవంతుల జాబితా ఇదిగో!

  • రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తి విలువ రూ.115 కోట్లకు పైమాటే
  • 31 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న‌ ఏడీఆర్ నివేదిక 
  • రూ.5,300 కోట్ల ఆస్తితో బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి అత్యంత ధనవంతుడు
  • తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లు
  • 36 మంది ఎంపీలపై హత్య, హత్యాప్రయత్నం వంటి తీవ్రమైన కేసులు
రాజ్యసభ సభ్యుల ఆర్థిక, నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదికలో పలు కీలక, ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని పెద్దల సభలో అత్యధిక సంపన్నులతో పాటు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 233 మంది సభ్యులకు గాను 226 మంది సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది.

నివేదిక ప్రకారం ఈ 226 మంది ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లుగా ఉంది. సగటున ఒక్కో ఎంపీ ఆస్తి రూ.115 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. వీరిలో 31 మంది ఎంపీలు (14శాతం) రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న బిలియనీర్లుగా ఉన్నారు. మరోవైపు కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే తమ ఆస్తుల విలువ రూ.20 లక్షల లోపు ఉన్నట్లు ప్రకటించారు. సుమారు 100 మంది ఎంపీల ఆస్తులు రూ.10 కోట్లకు పైగా ఉండగా, 41 మందికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య, 66 మందికి రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య ఆస్తులున్నాయి.

ఆస్తులతో పాటు ఎంపీల నేర చరిత్రను కూడా ఏడీఆర్ విశ్లేషించింది. విశ్లేషించిన వారిలో 69 మంది ఎంపీలపై (31 శాతం) క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 36 మంది ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక ఎంపీపై హత్య కేసు (సెక్షన్ 302), మరో నలుగురిపై హత్యాప్రయత్నం (సెక్షన్ 307) కేసులు ఉన్నాయి. ఇంకో నలుగురు ఎంపీలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.

పార్టీల వారీగా చూస్తే.. బీజేపీకి చెందిన 107 మంది ఎంపీలలో 28 మందిపైనా, కాంగ్రెస్‌కు చెందిన 29 మందిలో 12 మందిపైబా క్రిమినల్ కేసులు ఉన్నాయి. టీడీపీకి చెందిన నలుగురిలో ముగ్గురిపై, బీఆర్ఎస్ కి చెందిన ముగ్గురు ఎంపీలపైనా కేసులు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (9 మందిలో 2), డీఎంకే (8 మందిలో 2), సమాజ్‌వాదీ పార్టీ (4 మందిలో 2), సీపీఎం (ముగ్గురిలో ముగ్గురు), ఆర్జేడీ (ముగ్గురిలో ఇద్దరు) చొప్పున క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు ఉన్నారు.

రాష్ట్రాల వారీగా సంపద కేంద్రీకరణలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లు కాగా, వారిలో నలుగురు బిలియనీర్లు ఉన్నారు. వ్యక్తిగతంగా చూస్తే, బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రూ.5,300 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు. పంజాబ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజిందర్ గుప్తా (రూ.5,053 కోట్లు), కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (రూ.2,558 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఆప్ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ కేవలం రూ.3.79 లక్షల ఆస్తితో జాబితాలో అట్టడుగున ఉన్నారు.

కొంతమంది ఎంపీలకు ఆస్తులతో పాటు భారీగా అప్పులు కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పరిమళ్ నత్వానీకి రూ.755 కోట్ల ఆస్తులుండగా, అత్యధికంగా రూ.256 కోట్ల అప్పులు ఉన్నాయి. ఏపీ చెందిన టీడీపీ ఎంపీ బి. రామకృష్ణ రూ.672 కోట్ల ఆస్తులు, రూ.200 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌కు రూ.1,578 కోట్ల ఆస్తులు, రూ.149 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు తెలిపారు.

Bandi Parthasaradhi
Rajya Sabha MPs Assets
Association for Democratic Reforms
Richest Rajya Sabha Members
ADR Report 2024
Bandi Parthasaradhi Net Worth

More Telugu News