భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త క్రేజ్.. జపాన్ సౌందర్య ఉత్పత్తుల వైపు చూపు

  • భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్లతో జపనీస్ బ్యూటీ ఉత్పత్తులకు పెరిగిన క్రేజ్
  • కొరియన్ బ్యూటీ స్థానంలోకి వస్తున్న జే-బ్యూటీ విధానం
  • సున్నితమైన ఫార్ములాలతో భారతీయ వాతావరణానికి అనుకూలమని నిపుణుల మాట
  • ట్రెండ్స్ ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తప్పనిసరి అని హెచ్చరిక
భారతదేశంలో సౌందర్య సాధనాల వినియోగ ధోరణులు వేగంగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా మార్కెట్‌ను శాసించిన కొరియన్ బ్యూటీ (కే-బ్యూటీ) స్థానంలో ప్రస్తుతం జపనీస్ బ్యూటీ (జే-బ్యూటీ) ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా భారతీయ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు జపాన్ సౌందర్య ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో వీటికి ఆదరణ భారీగా పెరిగింది. 

ఎన్డీటీవీ కథనం ప్రకారం... గతంలో పదికి పైగా దశలతో కూడిన కొరియన్ స్కిన్‌కేర్ విధానాన్ని అనుసరించిన వినియోగదారులు, ఇప్పుడు సరళంగా ఉండే జపనీస్ పద్ధతుల వైపు ఆకర్షితులవుతున్నారు. తక్కువ ఉత్పత్తులతో గరిష్ఠ ఫలితాలను సాధించడం, దీర్ఘకాలికంగా చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడమే జే-బ్యూటీ ప్రధాన సూత్రం. 2026 నాటికి జపాన్ పర్యటనలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో, అక్కడి సన్‌స్క్రీన్‌లు, క్రీమ్‌లు, రైస్ మాస్క్‌లు, హెయిర్ ట్రీట్‌మెంట్లపై ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రత్యేక షాపింగ్ గైడ్‌లను సైతం సిద్ధం చేస్తున్నారు.

ఏళ్ల తరబడి క్లిష్టమైన సౌందర్య ఉత్పత్తులను వాడి విసిగిపోయిన వారికి జే-బ్యూటీ విధానం కొత్తగా, ఆచరణాత్మకంగా అనిపిస్తోందని కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతా గ్రెవాల్ పేర్కొన్నారు. భారతీయ వాతావరణ పరిస్థితులకు జపాన్ ఉత్పత్తులు అత్యంత అనువుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి వేడి, తేమతో కూడిన వాతావరణంలో జపాన్ బ్రాండ్లకు చెందిన తేలికపాటి జెల్స్, లోషన్లు, ఫ్లూయిడ్ సన్‌స్క్రీన్‌లు ప్రభావవంతంగా పనిచేస్తాయని బెంగళూరుకు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ సుమన్ ఎస్ వివరించారు.

అయితే, ఏ సౌందర్య ఉత్పత్తి అయినా అందరికీ ఒకేలా సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త ఉత్పత్తులను ప్రయత్నించే ముందు తప్పనిసరిగా 'ప్యాచ్ టెస్ట్' చేసుకోవాలని, ముఖ్యంగా మొటిమలు, తామర వంటి సమస్యలున్న వారు డెర్మటాలజిస్టును సంప్రదించాలని సూచిస్తున్నారు. కేవలం ధోరణులను గుడ్డిగా అనుసరించకుండా, తమ చర్మతత్వానికి ఏది సరిపోతుందో తెలుసుకుని ఎంచుకోవడం శ్రేయస్కరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Japanese Beauty Products
Indian Beauty Influencers
J-Beauty Trends
Skincare Trends India
Japanese Sunscreens

More Telugu News