భారత్‌లో మళ్లీ అందుబాటులోకి టెలిగ్రామ్‌.. నిషేధం ఎత్తివేత

  • నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ నేపథ్యంలో వారంపాటు నిషేధం
  • చీటింగ్‌ ముఠాలు టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారన్న ఎన్‌టీఏ ఫిర్యాదు
  • మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌పై ఆంక్షలు జూన్‌ 30 వరకు కొనసాగింపు
  • కేంద్ర నిర్ణయాన్ని ఇటీవల సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
నీట్‌ యూజీ-2026 రీఎగ్జామినేషన్‌ నేపథ్యంలో భారత్‌లో తాత్కాలికంగా నిలిపివేసిన టెలిగ్రామ్‌ సేవలను మళ్లీ పునరుద్ధరించారు. వారంపాటు నిషేధం అనంతరం మంగళవారం నుంచి గూగుల్‌ ప్లే స్టోర్‌లో టెలిగ్రామ్‌ యాప్‌ తిరిగి అందుబాటులోకి వచ్చింది.

నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు చీటింగ్‌ ముఠాలు టెలిగ్రామ్‌ను ఉపయోగించి అభ్యర్థులను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం జూన్‌ 16 నుంచి 22 వరకు టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధించింది.

అయితే టెలిగ్రామ్‌లో సందేశాలను సవరించే (మెసేజ్‌ ఎడిట్‌) ఫీచర్‌పై విధించిన ఆంక్షలు మాత్రం జూన్‌ 30 వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో మాత్రం ఇంకా కనిపించడం లేదు.

జూన్‌ 21న నిర్వహించిన నీట్‌ యూజీ రీ-ఎగ్జామినేషన్‌ విజయవంతంగా పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టెలిగ్రామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అత్యవసర అధికారాలను వినియోగిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది.

Telegram
Telegram India Ban
NEET UG Re-examination
NTA Cheating Case
Google Play Store
IT Act Section 69A

More Telugu News