సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు అప్‌డేట్.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు వచ్చేశాయ్!

  • దశలవారీగా సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ ఫలితాల విడుదల
  • ఇప్పటికే 87 శాతానికి పైగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తి
  • డిజిలాకర్ పోర్టల్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచన
  • మే 13న ఫలితాల తర్వాత 1.68 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ ఫలితాలను దశలవారీగా విడుదల చేయడం ప్రారంభించింది. జూన్ 21 నాటికి 87 శాతానికి పైగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఈ ఏడాది మే 13న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, కీలక సబ్జెక్టులలో వచ్చిన మార్కులపై, అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కుల వెరిఫికేషన్, సమాధాన పత్రాల రీ-ఎవాల్యుయేషన్ కోసం సుమారు 1.68 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

అందిన దరఖాస్తులలో అధిక భాగాన్ని ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని సీబీఎస్ఈ ఆదివారం తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించింది. విద్యార్థులు తమ అప్‌డేటెడ్ ఫలితాలను results.digilocker.gov.in వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని సూచించింది. విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర వివరాలతో లాగిన్ అయి ఫలితాలను తెలుసుకోవచ్చు.

పోర్టల్‌లో 'Changes Updated' (మార్పులు జరిగాయి), 'No Change' (మార్పు లేదు), లేదా 'Under Process' (ప్రక్రియలో ఉంది) అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఫలితాల్లో ఎలాంటి మార్పు లేని విద్యార్థులు, అవసరమనుకుంటే తమ సమాధాన పత్రాలను భౌతికంగా పరిశీలించుకునే అవకాశం కూడా ఉంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో, కచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు ఫలితాలను దశలవారీగా విడుదల చేస్తున్నామని బోర్డు వివరించింది.                                

CBSE
CBSE Class 12 re-evaluation results
CBSE marks verification 2024
CBSE results digilocker
Central Board of Secondary Education
CBSE 12th board results update

More Telugu News