విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. ఇంగ్లండ్ పర్యటనపై సందిగ్ధత

  • ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీకి ఫిట్‌నెస్ పరీక్ష
  • ఐపీఎల్ ఫైనల్‌లో అయిన గాయం నుంచి కోలుకుంటున్న విరాట్
  • మెడికల్ రిపోర్టుల ఆధారంగానే సెలక్టర్ల తుది నిర్ణయం
  • వచ్చే వారం భేటీ కానున్న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటనలోని వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే ముందు అత‌ని లభ్యతపై సందిగ్ధత నెల‌కొంది. గాయం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ ప్రస్తుతం కోలుకుంటున్నాడ‌ని, ఫిట్‌నెస్ నివేదికల ఆధారంగానే సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 75 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, అదే మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అప్పటి నుంచి లండన్‌లో ఉంటూ పునరావాసం పొందుతున్నాడు. తాజాగా అతను బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ఫిట్‌నెస్ అసెస్‌మెంట్‌కు హాజరు కానున్నాడు.

"ఆదివారం ఢిల్లీలోని యశోభూమిలో తన 'వన్‌8' బ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్ ముగిసిన తర్వాత కోహ్లీ ఏ క్షణంలోనైనా ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకావొచ్చు. అంతా సవ్యంగా జరిగితే, ఇంగ్లండ్ వన్డేలకు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది" అని ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్న ఒక అధికారి ఐఏఎన్ఎస్‌కు నేడు తెలిపారు.

చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వచ్చే వారం సమావేశమై జట్టును ఎంపిక చేయనుంది. ఇటీవలే శ్రీలంకలో ఇండియా 'ఏ' జట్టు ఆడిన ట్రై సిరీస్‌ను పర్యవేక్షించిన అగార్కర్, ఇప్పుడు కోహ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. జూలై 14 నుంచి 19 వరకు బర్మింగ్‌హామ్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జరగనున్న ఈ ముఖ్యమైన సిరీస్‌కు విరాట్‌ ఎంపిక అనేది అత‌ని ఫిట్‌నెస్ నివేదికలపైనే పూర్తిగా ఆధారపడి ఉంది.

Virat Kohli
India England ODI Series
BCCI Fitness Test
IPL 2026 Injury
Indian Cricket Team
Ajit Agarkar

More Telugu News