ఎంపీలపై సంజయ్‌ రౌత్‌ బూతులు.. కట్‌ చేయొద్దంటూ మీడియాకు సూచన!

  • మీడియా సమావేశంలో రౌత్‌ అభ్యంతరకర పదజాలం
  • పార్టీని వీడుతున్న నేతలపై తిట్ల దండకం
  • వ్యాఖ్యలను కట్ చేయొద్దని మీడియాకు సూచన
  • తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం లేదని వివరణ
  • భావోద్వేగంతో మాట్లాడారని పార్టీ నేతల వివరణ
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చర్చనీయాంశమైంది. పార్టీని వీడుతున్న నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ మీడియా సమావేశంలోనే అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. అంతటితో ఆగకుండా, తాను మాట్లాడిన మాటలను కట్ చేయకుండా ప్రసారం చేయాలని మీడియా ప్రతినిధులను కోరడం మరింత చర్చకు దారితీసింది.

ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి మరికొందరు నాయకులు బయటకు వెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్ పార్టీని వీడుతున్న నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని 'నమ్మకద్రోహులు'గా అభివర్ణించారు. కొందరు డబ్బు కోసం పార్టీ మారుతున్నారని ఆరోపించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని పూలతో సత్కరించాలా అని ప్రశ్నించారు.

తన వ్యాఖ్యలపై తర్వాత మీడియా ప్రశ్నించగా కూడా రౌత్ వెనక్కి తగ్గలేదు. తాను మాట్లాడిన భాషపై ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు. ఎదుటివారికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. రౌత్ వ్యాఖ్యలపై అదే వేదికపై ఉన్న పార్టీ ఎంపీ అనిల్ దేశాయ్ స్పందించారు. రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న వ్యక్తి భావోద్వేగానికి గురైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు రావచ్చని అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరినీ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని చేసినవి కావని పేర్కొన్నారు.

అయితే ప్రత్యర్థి పార్టీల నేతలు ఈ అంశాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సాత్ మాట్లాడుతూ పార్టీని వీడిన నేతలను ఈ విధంగా అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎంపీలు పార్టీతో కొనసాగాలని అనుకోకపోవడానికి ఇలాంటి వైఖరే కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మరోవైపు శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా రౌత్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని నాయకత్వ సంక్షోభాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాష ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్ మాత్రం రౌత్‌కు మద్దతుగా నిలిచింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్‌ ప్రతాప్‌ఘడీ మాట్లాడుతూ, పార్టీ చీలికలు, వరుస రాజకీయ పరిణామాల నేపథ్యంలో రౌత్ ఆవేదన అర్థం చేసుకోవచ్చని అన్నారు.

Sanjay Raut
Shiv Sena UBT
Maharashtra Politics
Uddhav Thackeray
Sanjay Raut Abusive Language
Maharashtra Political Crisis

More Telugu News