పోలవరం ముంపుపై కేంద్రం కీలక లేఖ.. కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీశ్ రావు

  • తెలంగాణ పరిధిలో ముంపు ప్రాంతాలను ఆదుకుంటామన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ
  • పీపీఏ రక్షణ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న హరీశ్ రావు
  • ఇచ్చిన హామీ ఫైళ్లకే పరిమితం కాకుండా చూడాలని విన్నపం

తెలంగాణ సరిహద్దు గ్రామాలను భయపెడుతున్న పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ (వెనక్కి తన్నే నీరు) ముంపు సమస్యపై ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన వినతిపత్రంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ’ (PPA) సానుకూలంగా స్పందిస్తూ రాతపూర్వక హామీ ఇచ్చింది. ఈ లేఖకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.


పోలవరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం కారణంగా తెలంగాణ పరిధిలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను రెండు విధాలుగా ఆదుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. ఒకటి.. తగిన ఇంజనీరింగ్ పనుల ద్వారా ఆయా గ్రామాలకు ముంపు ముప్పు లేకుండా రక్షించడం. రెండు.. అది సాధ్యం కాకపోతే పునరావాస-పునర్నిర్మాణ చట్టం కింద ఆ భూములను సేకరించి రైతులకు పక్కా నష్టపరిహారం అందించడం.


2025 ఏప్రిల్ 8న జరిగిన అంతర్రాష్ట్ర సమావేశ నిర్ణయాలకు తాము కట్టుబడి ఉన్నామని పీపీఏ తెలిపింది. గోదావరి బేసిన్ పరిధిలోని తెలంగాణ ప్రజల జీవనోపాధిని, గిరిజనుల వ్యవసాయ భూములను కాపాడటానికి శాస్త్రీయ అంచనాలు, సమగ్ర వరద నివారణ చర్యలు తీసుకుంటామని లేఖలో పునరుద్ఘాటించింది. తెలంగాణ ప్రజల ప్రాణాలకు, ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది.


ఈ నేపథ్యంలో... కేంద్ర ప్రభుత్వం ముంపు ఆందోళనలను అధికారికంగా గుర్తించి, రక్షణకు హామీ ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. అయితే, ఈ హామీలు కేవలం ఆఫీసు ఫైళ్లకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్‌లో సకాలంలో అమలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రజల భద్రత, రైతుల ఉపాధి విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం, పీపీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కలిసి సమన్వయంతో వ్యవహరించి, ప్రభావితమయ్యే ప్రతి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.


Harish Rao
Polavaram Project Authority
Polavaram Backwater Submergence
BRS Party Telangana
Telangana Border Villages
Godavari Flood Relief

More Telugu News